
ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు
కడప అర్బన్ : కడప నగరంలోని ఎర్రముక్కపల్లె స ర్కిల్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ ప్రమాద సంఘటన చివరకు పోలీసు వ్యవస్థకు తీరని అవమానం జరిగింది. ఏకంగా బ్లూకోల్ట్స్ పోలీసులను అవమాన పరిచేలా ఆగంతకులు దాడి చేశారు. ఈ సంఘటనపై ఒన్‌టౌన్ సిఐ టివి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి.
♦ కడప నగరంలోని ఎర్రముక్కపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం నూర్, మస్తాన్‌ల వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. మస్తాన్ తరపున మహబూబ్ బాషా, నూర్ తరపున రహమాన్ పెద్దమనుషులుగా వచ్చి ద్విచక్రవాహనదారుల మధ్య నెలకొన్న ఘర్షణను సర్దుబాటు చేసే క్రమంలో స్థానికులలో కొందరు మహబూబ్‌బాషాపై దాడి చేశారు. ఈ క్రమంలో మహబూబ్‌బాషా డయల్ 100కు సమాచారం ఇచ్చారు.
♦ ఫోన్ కాల్ అందుకున్న వెంటనే బ్లూకోల్ట్స్ –3 కానిస్టేబుల్ రమణ (పిసి నెం.3050), హోంగార్డు రణధీర్‌రెడ్డిలు తమ ద్విచక్రవాహనంలో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
♦ ఆ సమయంలో స్థానికుల చేతిలో దెబ్బలు తిన్న మహబూబ్ బాషా తనపై దాడి చేసిన వారిలో సెల్‌పాయింట్ నిర్వాహకుడు రహమాన్‌తో పాటు, ప లువురు ఉన్నారని చూపించాడు. దీంతో వారిని స ర్దుబాటు చేసేందుకు కానిస్టేబుల్ రమణ, హోంగా ర్డు రణధీర్ రెడ్డిలు ప్రయత్నించగా నిందితులు పోలీసు లపై దాడి చేయడంతో పాటు వారిని ఎర్రముక్క పల్లె సర్కిల్ నుంచి తరుముకుంటూ సంధ్యాసర్కిల్ వరకు వచ్చినట్లు ‘పిటిజెడ్’ కెమెరాలో నమోదైంది.
♦ తమపై దాడి చేసిన విషయాన్ని బాధిత పోలీసులు ఒన్‌టౌన్ సీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ లు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
♦ కానిస్టేబుల్ రమణతో పాటు, హోంగార్డు రణధీర్ రెడ్డిలు రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టీవీ సత్యనారాయణ తెలిపారు.
టీడీపీ నేతల హైడ్రామా..
♦ ఈ సంఘటనలో నిందితులుగా పోలీసులు రహమాన్, ఇంతియాజ్, ఆరిఫ్, మహబూబ్‌బాషా, నూర్‌బాషాలతో పాటు మరికొందరిని గుర్తించారు. వీరిలో ఇంతియాజ్ టీడీపీ మైనార్టీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జిలానీబాషా మేనల్లుడుగా పోలీసులు గుర్తించారు. కాగా, పోలీసులపై దాడి సంఘటన జరిగిన తర్వాత జిలానీబాషా, తన అనుచరులతో ఎర్రముక్కపల్లె వద్ద ఉండగా ఎస్‌ఐ రంగారావు, పోలీసు సిబ్బంది తనను చితకబాదారని ఆరోపించారు. ఈమేరకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చూశారు. కానీ పోలీసులు మాత్రం కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేశారు.