టీడీపీకి ఝలక్‌ | Tamarbha Satyamadavi Joined Into YSRCP In Visakhapatnam | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఝలక్‌

Jun 30 2019 12:29 PM | Updated on Jul 3 2019 11:33 AM

Tamarbha Satyamadavi Joined Into YSRCP In Visakhapatnam - Sakshi

సాక్షి, హుకుంపేట (విశాఖపట్నం): ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. హుకుంపేట మండలాధ్యక్షురాలు, టీడీపీ సీనియర్‌ మహిళా నాయకురాలు తమర్భ సత్యమాధవి శనివారం తన ఎంపీపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగా ఎంపీపీ పదవికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు ఆమె అందజేశారు. అలాగే టీడీపీ జిల్లా నాయకులకు పార్టీకి సంబంధించిన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలకు ఒరిగిందేమి శూన్యమన్నారు. గిరిజనుల ఆదరణ కోల్పోయిన టీడీపీకి భవిష్యత్‌ లేదని పేర్కొన్నారు. గిరిజనులంతా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్నారని, ఈ విషయం ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువైందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించి తన ఎంపీపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌సీపీ గూటికి సత్యమాధవి
ఎంపీపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తమర్భ సత్యమాధవి తన అనుచరులతో కలిసి అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతోనే గిరిజనులకు మంచి జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమలు చేస్తున్నారన్నారు. బాక్సైట్‌ తవ్వకాల జీవోలను రద్దు చేసి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సత్యమాధవికి ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అలాగే టీడీపీకి చెందిన గత్తుం పంచాయతీ తాజా మాజీ సర్పంచ్‌ గత్తుం భీమ్‌నాయుడు, మాజీ వార్డుమెంబర్లు శోభ రమేష్, గత్తుం లక్ష్మీనాయుడులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.

పదవులకు రాజీనామా చేశాకే చేర్చుకుంటాం: ఎమ్మెల్యే పాల్గుణ
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ, ఇతర పార్టీల నేతలు వైఎస్సార్‌సీపీలో చేరాలంటే ముందుగా వారు రాజకీయ, పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. హుకుంపేట ఎంపీపీగా పనిచేసిన తమర్భ సత్యమాధవి కూడా తన పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు గండేరు చినసత్యం, మండల పార్టీ అధ్యక్షుడు గెమ్మెలి కొండబాబు, మాజీ వైస్‌ ఎంపీపీ బత్తిరి రవిప్రసాద్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగం మత్స్యలింగం, సివేరి కొండలరావు, ఎంపీటీసీ మాజీ సభ్యులు కె.బి.సావిత్రి, కంబిడి చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న
సత్యమాధవి
వైఎస్సార్‌సీపీలో చేరిన ఎంపీపీ సత్యమాధవి, మాజీ సర్పంచ్‌ భీమ్‌నాయుడులకు కండువాలు కప్పుతున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement