దేశానికి కాలసర్ప దోషం ఉంది: శారద పీఠాధిపతి

Swatmanandendra Saraswati Conducts Yagam To Fight Coronavirus - Sakshi

కరోనా వైరస్‌ నివారణకు శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక హోమాలు

శ్రీకాళహస్తిలో నేడు ధన్వంతరి హోమం

సాక్షి, విశాఖపట్నం: కరోనా (కోవిడ్‌–19) మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభం అయ్యాయి. స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. పీఠంలో నేటి నుంచి ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా లోక కల్యాణం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ధన్వంతరి హోమం ప్రారంభమైంది. ముందు జాగ్రత్త చర్యగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే అన్ని ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి.

పాప గ్రహాల శక్తి పుంజుకుంది
ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నేటి నుండి నిర్వహిస్తున్నామన్నారు. వేద మంత్రాలు, బీజాక్షరాల సంపుటి చేసి, ఈ యాగాన్ని సామాజిక స్పృహతో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని పేర్కొన్నారు. రాహువు దృష్టి గ్రహాల మీద పడటం వల్ల ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు.

‘శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీద ప్రభావం ఉంది. ఏప్రిల్ 2 నుండి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉంది. వీటన్నింటి వల్ల ఈ అమృత పాశు పత సహిత విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది ఈ క్రతువులో పాల్గొంటున్నారు. యాగంలో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు, గోమయంతో తయారైన పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నాం. ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుంది’ అని స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top