
సాక్షి, విజయవాడ: వరద ఉధృతి కారణంగానే ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అన్నారు. ఇసుక రీచ్‌లో ఉన్న వాస్తవ పరిస్థితులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలను అతిక్రమించి టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా దోచేశారని విమర్శించారు. 90 రోజుల నుంచి కృష్ణానది వరద ప్రవహిస్తోందన్నారు.
‘పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్, చంద్రబాబు దీక్షలో కేవలం రాజకీయం కోణమే ఉందని’ పృథ్వీరాజ్ ఆరోపించారు. ఇసుకపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని ప్రజలందరికీ తెలుసునన్నారు. దీనిపై చంద్రబాబు, పవన్ రాద్ధాంతం చేయటం పద్ధతి కాదని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంప్‌లకు రోడ్లు వేసారు కానీ, గ్రామాల్లో ప్రజల కోసం రోడ్లు వేయలేదని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతకు గత ప్రభుత్వమే కారణమని.. ఈ దోపిడీని భరించలేకే ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు.