పాఠశాలల తనిఖీకి సుప్రీంకోర్టు బృందం! | Supreme Court Group to inpection schools | Sakshi
Sakshi News home page

పాఠశాలల తనిఖీకి సుప్రీంకోర్టు బృందం!

Nov 11 2014 3:25 AM | Updated on Sep 2 2018 5:43 PM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లతో పాటు మౌళిక సదుపాయాల పరిశీలన కోసం సుప్రీంకోర్టు ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శ్రీకాకుళం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లతో పాటు మౌళిక సదుపాయాల పరిశీలన కోసం సుప్రీంకోర్టు ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతినిధుల బృందం కొన్ని రోజులుగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తోంది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లాలో కూడా ఈ బృందం పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని తెలుసుకుని మరుగుదొడ్లు, తాగునీటి వనరులకు మరమ్మతులు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. బృందం ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించవచ్చునని రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చింది. దీనిని అందుకున్న జిల్లా అధికారులు ఆగమేఘాల మీద మరమ్మతులు చేయించే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగా సోమవారం జిల్లాలోని సీఆర్పీలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లకు సమావేశం నిర్వహించారు. మూడు రోజుల్లోగా మరుగుదొడ్లు, మంచినీటి వనరులను వినియోగంలోనికి తెచ్చే బాధ్యతలను వారికి అప్పగించారు. ఈ పనిని పూర్తి చేయకపోతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్టు సీఆర్పీలు చెబుతున్నారు. స్కూల్ గ్రాంట్ నుంచి నిధులను వెచ్చించాలని వారికి సూచించారు. అయితే ఆ నిధులు స్కూల్ కమిటీ అకౌంట్‌లో ఉండడంతో పాటు ఎంఈవో పర్యవేక్షణలో లావాదేవీలు జరుగుతాయి.

అందువలన సీఆర్‌పీలకు ఆ ఖాతా నుంచి నిధులు వెచ్చించే అవకాశాలు లేకుండా ఉన్నాయి. అలాగే స్కూల్ గ్రాంట్ నిధులు పాఠశాల నిర్వహణతో పాటు విద్యుత్ చార్జీలు చెల్లించేందుకే వినియోగించాలి. ఇప్పుడు మరమ్మతుల కోసం నిధులు వెచ్చిస్తే పాఠశాల నిర్వహణ కష్టతరమవుతుందని పాఠశాలల కమిటీలు చెబుతూ నిధులు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంతో సీఆర్పీలు ఆవేదన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. విషయాన్ని ఆర్‌వీఎం పీవో గణపతిరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మరుగుదొడ్లు, నీటి వనరులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో పరిశీలన జరిపి నివేదికను మూడురోజుల్లోగా సమర్పించాలని మాత్రమే సీఆర్పీలకు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లకు సూచించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement