ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర

Support price for Aqua products in AP - Sakshi

త్వరలో అథారిటీ ఏర్పాటు  

మంత్రి మోపిదేవి వెల్లడి 

సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు నిర్ణయిస్తున్న విధంగానే రొయ్యలు, చేపలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించనుందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు. మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులు సాగు ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందన్నారు. ఇదే తరహాలో రొయ్యలు, చేపలకు మద్దతు ధరను ప్రకటించనుందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. 

త్వరలో ఆక్వా అథారిటీ 
► రొయ్యలు, చేపల ధరలు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ–మార్కెటింగ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాం. ఆక్వా ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పిస్తాం. 
► చేపలు, రొయ్యల పెంపకాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తాం. ఆక్వా అథారిటీ ఏర్పాటు చేస్తాం. ఇది పొగాకు బోర్డు తరహాలోనే ఉంటుంది.  
► లాక్‌డౌన్‌తో ఆక్వా రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడంతో రైతులు లబ్ధి పొందారు. 

ఎమ్మెల్యేలతో సమీక్ష 
చేపల రైతులు, చేపల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మంత్రి మోపిదేవి సమీక్ష జరిపారు. వ్యాపారులు ప్రతి క్వింటాల్‌కు 5 కేజీలు అదనంగా చేపలను కాటా వేస్తున్నారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని రైతులు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మోపిదేవి చెప్పారు. ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, సింహాద్రి కృష్ణప్రసాద్, పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. 

భారీగా పంటల సేకరణ 
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పంటల సేకరణ జరిపిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. రూ.1400 కోట్ల విలువ చేసే కందులు, శనగలు, మొక్కజొన్న, పసుపు పంటలను కొనుగోలు చేసిందన్నారు. టమాటా, అరటి, బత్తాయి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుందన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top