aqua products
-
ఎగుమతుల్లో పైపైకి..
సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. తొలి రెండేళ్లు కరోనా మహమ్మారికి ఎదురొడ్డి మరీ ఎగుమతులు సాగాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఊపందుకున్నాయి. ఉదా.. 2018–19లో రూ.8,929 కోట్ల విలువైన 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13,855 కోట్ల విలువైన 2.62 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2021–22 నాటికి అవి రూ.19,902 కోట్ల విలువైన 79.33 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.20వేల కోట్ల విలువైన 3.24 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. ఇక ఈ ఏడాది (2022–23) తొలి అర్ధ సంవత్సరంలో రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13వేల కోట్ల విలువైన 2.15 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆహార, ఆక్వా ఉత్పత్తులు కలిపి టీడీపీ ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22,784 కోట్ల విలువైన 34.10లక్షల టన్నులు ఎగుమతి అయితే 2021–22లో ఏకంగా రూ.39,921 కోట్ల విలువైన 82.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. టీడీపీ హయాంలో జరిగిన గరిష్ట ఎగుమతులను ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే సీఎం వైఎస్ జగన్ సర్కార్ అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున ఎగుమతులు జరగలేదని అధికారులతో పాటు ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది కోటి లక్షల టన్నుల మార్క్‌ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో నాన్ బాస్మతీ రైస్‌దే సింహభాగం రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్ బాస్మతీ రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, గోధుమలు, శుద్ధిచేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలతో పాటు పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. నాన్ బాస్మతీ రైస్ ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ నిలిచింది. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్ బాస్మతీ రైస్‌దే. 2018–19లో రూ.7,324కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు ఎగుమతి అయితే.. 2021–22లో రూ.17,225 కోట్ల విలువైన 68.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇక ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే రూ.7,718 కోట్ల విలువైన 29.48 లక్షల టన్నుల నాన్ బాస్మతీ రైస్ ఎగుమతి అయ్యింది. ఏపీ నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా, గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు ఎగుమతైంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. మూడేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే.. ► మూడేళ్ల క్రితం క్వింటాల్ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10 వేలకు పైగా పలికింది. ► రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలుకుతోంది. ► అలాగే, రూ.5 వేలు పలకని మినుములు రూ.7వేలు, వేరుశనగ సైతం రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతున్నాయి. ► కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు సైతం ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతున్నాయి. ► అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది. ► ఇక దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ శాతం కూడా గణనీయంగా తగ్గడం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు. 14వేల టన్నులు ఎగుమతి చేశాం 2021–22లో ఏపీ నుంచి 50 వేల నుంచి 60 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగాయి. మా కంపెనీ ఒక్కటే 14 వేల టన్నులు ఎగుమతి చేసింది. ఇరాన్, మలేసియా, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేశాం. ఈ ఏడాది కూడా ఎగుమతులు ఆశాజనకంగా ఉండబోతున్నాయి. – ఎం. ప్రభాకరరెడ్డి, ఏపీ కోఆర్డినేటర్, దేశాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపెనీ ఎగుమతులు పెరగడం రైతుకు లాభదాయకం గతేడాది రికార్డు స్థాయిలో ఆక్వా ఎగుమతులు జరిగాయి. రైతులకు కూడా మంచి రేటు వచ్చింది. రొయ్యలతో పాటు సముద్ర మత్స్య ఉత్పత్తులను కూడా వ్యాపారులు పోటీపడి కొన్నారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులు భారీగా ఎగుమతి అయ్యాయి. – ఐసీఆర్ మోహన్‌రాజ్, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ‘గాప్’ సర్టిఫికేషన్‌తో మరిన్ని ఎగుమతులు గతంలో ఎన్నడూలేని విధంగా 79 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులతో పాటు 20వేల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అయ్యాయి. వచ్చే సీజన్ నుంచి రైతులకు ‘గాప్’ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. అది ఉంటే యూరోపియన్ దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంవల్లే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్దఎత్తున ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
విరివిగా మత్స్యసంపద
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో 974 కి.మీ. తీర ప్రాంతం విస్తరించి ఉండటంతో మత్స్య సంపద విరివిగా ఉత్పత్తి అవుతోంది. వెనామీ రొయ్యలు, పండుగప్ప వంటి ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మత్స్య పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. మత్స్య పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో పాటు దానికి మరింత భద్రత కల్పించేలా ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ(ఏపీఎస్ఏడీఏ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఆక్వా పరిశ్రమకు గుర్తింపునిచ్చి రైతులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ఈ చట్టం చేసింది. దీని ప్రకారం ఆక్వా సాగు కోసం చెరువులు, ఉత్పత్తికి, విక్రయానికి, ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు తప్పనిసరిగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మత్స్యశాఖా ధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. లైసెన్స్‌లు పొందితే.. బినామీలు, నకిలీల బెడద తప్పుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే.. ఇప్పటి వరకు 90 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేసి లైసెన్స్‌లు జారీచేశారు. మరింత పెంచేలా.. గతం కంటే బాగా మత్స్యసాగు పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే దీనికి కారణం. వేట నిషేధ భృతి, సబ్సిడీ డీజిల్ తీర ప్రాంత మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మత్స్య సంపదను మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. – లాల్ మహమ్మద్, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. పెద్ద బోట్లు(మెకనైజ్డ్)కు నెలకు 3,000, చిన్న బోట్లు(మోటరైజ్డ్)కు నెలకు 300 లీటర్ల డీజిల్‌ను సబ్సిడీపై అందిస్తున్నారు. టీడీపీ హయాంలో లీటర్‌కు రూ.6.03 పైసలే సబ్సిడీ ఇచ్చేవారు. ఆ డబ్బులూ సకాలంలో వచ్చేవి కావు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లీటరుకు రూ.9 సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారుగా రూ.7.12 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం బోటు యజమానులకు అందిస్తోంది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇస్తోంది. ఏటా వేసవిలో 60 రోజుల పాటు సముద్రంపై వేట నిషేధాన్ని అమలు చేస్తారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే జీవన భృతిగా ఇచ్చారు. ఆ పంపిణీ విధానం కూడా సరిగా లేకపోవడంతో వాటిని దాదాపుగా దళారులే మింగేసేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జీవన భృతిని రూ.10 వేలకు పెంచి.. మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం సాయం చేయడం వల్ల రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తి పెరిగింది. 2014–15 నాటికి రాష్ట్రంలో 103 లక్షల మెట్రిక్ టన్నులుంటే.. 2020–21 నాటికి 150 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మత్స్య సంపదలతో పోలిస్తే.. ప్రస్తుతం 31 శాతం వాటా మన రాష్ట్రానిదే కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని మత్స్యకారులు చెబుతున్నారు. -
నిరంతర విద్యుత్‌తో ‘వెలుగు’తున్న ఆక్వా
జాలాది శ్రీమన్నారాయణ, జయలక్ష్మి.. ఆక్వా సాగుకోసం 2018–19లో 1,400 లీటర్ల డీజిల్‌ను వినియోగించారు. 2019–20లో అది 540 లీటర్లకు తగ్గింది. 2020–21లో 180 లీటర్లు సరిపోయింది. పామర్తి బాలకోటేశ్వరరావు ఆక్వా సాగుకోసం 2018–19లో 32 లీటర్ల డీజిల్ వినియోగించారు. 2019–20లో 12 లీటర్లకు తగ్గింది. 2020–21లో కేవలం 10 లీటర్లు మాత్రమే వినియోగించారు. సాక్షి, అమరావతి: చేప ఎండకుండా ఉండాలంటే మోటారుతో నీటిని తోడి చెరువు నింపాలి. చెరువులో రొయ్య బతికుండాలంటే నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా ఆక్వా రైతు ఆస్తులు అమ్ముకున్నా తీర్చలేనంత అప్పులపాలవడం ఖాయం. అందుకే ఆక్వా రైతులు ఖర్చెంతైనా పర్లేదనుకుంటూ డీజిల్ మోటార్లు వాడుతుంటారు. పెట్రోల్‌తో సమానంగా డీజిల్ ధరలు పెరుగుతూనే ఉండటంతో పెట్టుబడులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందేలా చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఈ భారాన్ని భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఆక్వాసాగుకు నిరంతర విద్యుత్‌ను సమకూరుస్తున్నాయి. ఫలితంగా డీజిల్ వాడకం కొన్ని ప్రాంతాల్లో సగానికిపైగా, మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆర్థికభారం తగ్గింది నేను ఆలపాడులో రొయ్యలు సాగుచేశాను. గతంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఎకరానికి రోజుకు 40 లీటర్ల డీజిల్ అవసరం ఉండేది. దానికి నెలకు రూ.86,800 ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు యూనిట్ కరెంటును రూ.1.50కి అందించారు. దీంతో ఇప్పుడు ఎకరానికి నెలకు కేవలం విద్యుత్ బిల్లు రూ.5,800 వస్తోంది. సబ్సిడీ లేకపోతే ఇదే బిల్లు నెలకు రూ.25 వేలకుపైనే వచ్చేది. విద్యుత్‌ను సబ్సిడీతో నిరంతరం ఇవ్వడం వల్ల నాలాంటి ఆక్వా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. – ముంగర నరసింహారావు, ఆక్వా రైతు, వడ్లకూటితిప్ప, కైకలూరు మండలం ఆక్వా రైతులకు వరం దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. నేను పెంచికమర్రు గ్రామంలో రొయ్యలు సాగుచేశాను. ఒక పంట సాగుకు నాలుగు నెలలు సమయం పట్టేది. 2019 ప్రారంభంలో నాలుగు నెలలకు ఒక ఎకరం రొయ్యల సాగుకు డీజిల్ కోసం రూ.3,47,200 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒక్కో ఎకరానికి రోజుకు కనీసం 40 లీటర్ల డీజిల్ వినియోగించాలి. ఇప్పుడు విద్యుత్ ధర రూ.1.50 చేయడం వల్ల నాలుగు నెలలకు కరెంటు బిల్లు రూ.24 వేలు మాత్రమే వస్తోంది. లక్షల్లో ఖర్చు మిగులుతోంది. – జయమంగళ కాసులు, రొయ్యల రైతు, పెంచికలమర్రు, కైకలూరు మండలం -
ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్, ఆంక్షలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు కొనసాగాయి. లాక్డౌన్ ఎత్తివేయగానే మరింత జోరందుకుని, ఎగుమతులు కొత్త పుంతలు తొక్కాయి. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వ్యవసాయ రంగంపై దృష్టి సారించారు. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రైతులను నాణ్యమైన ఉత్పత్తుల దిశగా ప్రోత్సహించారు. గ్రామాల్లో మౌలిక వసుతల కల్పన చేపట్టారు. కేంద్రం ప్రకటించని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇవ్వడం, మార్కెటింగ్ సౌకర్యాలు క ల్పించడంతో రైతులు ఉత్సాహంగా పంటలు వేశారు. పురుగు మందుల అవశేషాలు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి. దీంతో వ్యాపారులతో పాటు ఎగుమతిదారులూ పోటీ పడి ఉత్పత్తులు కొనుగోలు చేశారు. దీనివల్ల రైతులకు మంచి ధర వచ్చింది. ఎగుమతులూ భారీగా పెరిగాయి. టీడీపీ హయాంలో ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతుల కంటే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో 21 లక్షల టన్నులకు పైగా ఎక్కువగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులు, బియ్యం, మొక్కజొన్న, అపరాలు, శుద్ధి చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు, బెల్లం ఉత్పత్తులు భారీగా ఎగుమతవుతున్నాయి. ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు ఎగుమతవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2020–21లో రికార్డు స్థాయిలో రూ.29 వేల కోట్ల విలువైన 55.68 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఈ ఏడాది (2021–22) తొలి ఆరు నెలల్లోనే (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రూ.19 వేల కోట్ల విలువైన 38.86 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ఎగుమతులు జరగలేదని ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది 60 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22.78 వేల కోట్ల విలువైన 34.09 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు మాత్రమే జరిగాయి. రైతుకు మేలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామ స్థాయిలో కల్పించిన సౌకర్యాల వల్ల గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ప్రభుత్వ చర్యలతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తుండటంతో మార్కెట్లో వ్యాపారులతో పాటు ఎగుమతిదారులు కూడా రైతుల నుంచి మంచి ధరకు ఉత్పత్తులను కొంటున్నారు. మూడేళ్ల క్రితం క్వింటాల్ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10వేల వరకు వచ్చింది. రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలికింది. అలాగే రూ.5 వేలు పలకని మినుములు రూ.7 వేల మార్క్‌ను అందుకుంది. కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ధరకంటే రైతులకు మంచి ధర లభిస్తున్నాయి. అరటి, బత్తాయి, మామిడి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది. ఈ ఏడాది కూరగాయలతో పాటు కరివేపాకు సైతం విదేశాలకు ఎగుమతవుతోంది. ఇక కరోనా వేళల్లో కూడా రొయ్యలు, చేపలకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యల కారణంగా నాలుగేళ్ల క్రితం 86 శాతం ఉన్న యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ ఇప్పుడు 26 శాతానికి తగ్గాయి. దీంతో ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ఎగుమతులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. రైతుకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యం రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత రెండేళ్లుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో కల్పించిన మౌలిక సదుపాయాల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ఎగుమతులు కూడా నమోదవుతుండడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్ద ఎత్తున ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు పెడుతున్నాం. రైతులకు లబ్ధి చేకూర్చేలా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. – కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
ఆక్వా పరిశ్రమకు ఊతం
సాక్షి, అమరావతి: దేశంలోనే మత్స్యసంపద ఉత్పత్తిలో ముందున్న మన రాష్ట్రంలో ఉత్పత్తి మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా రెండేళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం.. సాగు నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు ఊతం ఇచ్చేందుకు మరిన్ని కార్యక్రమాల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్లలో ఆక్వా ఉత్పత్తిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాగు విస్తీర్ణం మూడేళ్లలో 48 వేల హెక్టార్ల మేర పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.546.97 కోట్లతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి నిర్వహణ బాధ్యతలను ఆక్వా రైతుసంఘాలకే అప్పగించాలని చూస్తోంది. 2020–21లో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఉత్పత్తిని సాధించగా, 2021–22లో 50.85 లక్షల ఎంటీల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 11.36 లక్షల ఎంటీల మత్స్యసంపద ఉత్పత్తి అయింది. పంట పండినచోటే మార్కెటింగ్‌తో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు మొత్తం 4,813 ఎంటీల సామర్థ్యంతో 92 ప్రాసెసింగ్ యూనిట్లు, మొత్తం 300 ఎంటీల సామర్థ్యంతో 30 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలు, రొయ్యలను ప్రాసెస్ చేసేందుకు ఇవి సరిపోవడం లేదు. దీంతో పొరుగు రా>ష్ట్రాలకు తరలించాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారు. తోడు సీజన్ మొదలుకాగానే అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం వస్తోంది. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఆక్వాసాగు ఎక్కువగా ఉన్న తీరప్రాంత జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.6.39 కోట్లతో 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఒక్కొక్కటి రూ.40 కోట్ల వ్యయంతో 10 ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతుంది. కనీసం 2 వేల ఎంటీల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతముంది. 54,500 హెక్టార్లలో ఉప్పునీటి, 1.44 లక్షల హెక్టార్లలో మంచినీటి చెరువుల్లో ఆక్వా సాగవుతోంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో 70 శాతం, చేపల్లో 38 శాతం వాటా మన రాష్ట్రానిదే. ఆక్వారైతుకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర లభించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగానే ఆక్వా సాగవుతున్న జిల్లాల్లో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు నిర్ణయిస్తున్న విధంగానే రొయ్యలు, చేపలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించనుందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు. మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులు సాగు ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందన్నారు. ఇదే తరహాలో రొయ్యలు, చేపలకు మద్దతు ధరను ప్రకటించనుందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. త్వరలో ఆక్వా అథారిటీ ► రొయ్యలు, చేపల ధరలు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాం. ఆక్వా ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పిస్తాం. ► చేపలు, రొయ్యల పెంపకాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తాం. ఆక్వా అథారిటీ ఏర్పాటు చేస్తాం. ఇది పొగాకు బోర్డు తరహాలోనే ఉంటుంది. ► లాక్‌డౌన్‌తో ఆక్వా రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడంతో రైతులు లబ్ధి పొందారు. ఎమ్మెల్యేలతో సమీక్ష చేపల రైతులు, చేపల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మంత్రి మోపిదేవి సమీక్ష జరిపారు. వ్యాపారులు ప్రతి క్వింటాల్‌కు 5 కేజీలు అదనంగా చేపలను కాటా వేస్తున్నారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని రైతులు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మోపిదేవి చెప్పారు. ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, సింహాద్రి కృష్ణప్రసాద్, పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. భారీగా పంటల సేకరణ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పంటల సేకరణ జరిపిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రూ.1400 కోట్ల విలువ చేసే కందులు, శనగలు, మొక్కజొన్న, పసుపు పంటలను కొనుగోలు చేసిందన్నారు. టమాటా, అరటి, బత్తాయి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుందన్నారు. -
జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేడింగ్, ప్యాకింగ్ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు ఈ బజార్ల ద్వారా తగిన స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు లభించాలని.. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలని ఆయనన్నారు. జనతా బజార్ల విధివిధానాలు.. అధికారుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను జనతా బజార్లలో విక్రయించేలా చూడాలి. ► కనీసం 20–25 రకాల ఉత్పత్తులు వీటిల్లో అందుబాటులో ఉంచాలి. ► పళ్లు, కూరగాయాలు, గుడ్లు, పాలు, ఆక్వా ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు లభించే ఈ బజార్లలో వీటి వినియోగం 30–35 శాతం ఉండాలి. ► ఇలా అయితే మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మంచి ధరలు వచ్చి లాభం చేకూరుతుంది. ► ఏడాదిలోపు వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ► గ్రేడింగ్, ప్యాకింగ్ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి. ► ఈ బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు లభించాలి. ► అలాగే, కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి. ► మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే గ్రేడింగ్, ప్యాకింగ్ బాగుండాలి. ► సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలి. మరింత మేధోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలి. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లోనూ శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభం కానున్నాయి. వాటిలోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లోని గోడౌన్లకు కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశాలు లేకపోవడంతో వాటిని మినహాయించాలన్నారు. వంద యార్డుల గుర్తింపు ► రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల పరిధిలో 150 మార్కెట్ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు. ► వాటిలో శనివారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ► వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి. ► కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. ► మార్కెట్ కమిటీల పరిధిలో ఉండే మేజర్ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. అందుబాటులోకి మొబైల్ బజార్లు ► కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100 రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు. ► వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. -
నిర్దేశించిన రేట్లకు రొయ్యలు కొనాల్సిందే
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత, వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి, ఎంపెడా చైర్మన్ కేఎస్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు, రైతుల ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులెవరూ నష్టపోకూడదని ఎంపెడా చైర్మన్‌కు సీఎం స్పష్టం చేశారు. కరోనా వైరస్ పేరుతో రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఎగుమతిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపెడా చైర్మన్ సీఎం దృష్టికి తెచ్చారు. రాష్ట్రం నుంచే భారీగా ఎగుమతులు ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఎంపెడా చైర్మన్, అధికారులను సీఎం ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల్లో అధికభాగం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న నేపధ్యంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ధరలు తగ్గినప్పుడు రైతులు నేరుగా కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసుకునేలా ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందేలా చూడాలని సీఎం సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ తరహాలోనే ఆక్వాజోన్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనాం వ్యవస్థను తెచ్చి సచివాలయాలను, సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవడం, ఆర్థిక సహాయం, కోల్డ్ స్టోరేజీలు, ఎగుమతులు తదితర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డికి సూచించారు. గత ఐదురోజుల్లో 2,832 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు జరగగా 2,070 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. -
ఆక్వా రైతుల కోసం నూతన ఉత్పత్తులు
-
ఆక్వా ఎగుమతితో విదేశీ మారకద్రవ్యం
నాస్కా రీజనల్ కో–ఆర్డినేటర్ నందకిషోర్ నెల్లూరు రూరల్ : ఆక్వా ఉత్పత్తుల ఎగుమతితో విదేశీమారద ద్రవ్యం వస్తుందని నాస్కా రీజనల్ కో–ఆర్డినేటర్ టి.నందకిశోర్ అన్నారు. ఎంపెడా(సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ సంస్థ నెల్లూరు శాటిలైట్ సెంటర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆక్వా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ సౌకర్యంపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తోందన్నారు. రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలంటే ఎంపెడాలో రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, భూమి పాస్‌బుక్, సాగు చేస్తున్న చేప, రొయ్యల రకాలు, తదితర వివరాలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రైతుల ఉత్పత్తులను పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని, ఈ సర్టిఫికేట్ ఆధారంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాస్కా ఫీల్డ్మేనేజర్ పాపయ్య, పావనమూర్తి, రవీంద్ర, పర్వేజ్, ఆక్వా సొసైటీ అధ్యక్షుడు కుమారి అంకయ్య, ఉడతా వెంకటేశ్వర్లు, బాలయ్య, ఆక్వా రైతులు పాల్గొన్నారు.