ఆక్వా పరిశ్రమకు ఊతం

Aqua sector in Andhra Pradesh set to get Rs 546-crore boost - Sakshi

సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంపు లక్ష్యం

రూ.546.97 కోట్లతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు

ఆక్వా రైతుసంఘాలకే నిర్వహణ బాధ్యతలు

పంట పండినచోట మార్కెటింగ్‌ వసతి

10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

సాక్షి, అమరావతి: దేశంలోనే మత్స్యసంపద ఉత్పత్తిలో ముందున్న మన రాష్ట్రంలో ఉత్పత్తి మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా రెండేళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం.. సాగు నుంచి మార్కెటింగ్‌ వరకు రైతులకు ఊతం ఇచ్చేందుకు మరిన్ని కార్యక్రమాల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్లలో ఆక్వా ఉత్పత్తిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాగు విస్తీర్ణం మూడేళ్లలో 48 వేల హెక్టార్ల మేర పెంచాలని నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా రూ.546.97 కోట్లతో ప్రాసెసింగ్, ప్రీ  ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పి నిర్వహణ బాధ్యతలను ఆక్వా రైతుసంఘాలకే అప్పగించాలని చూస్తోంది.  2020–21లో 46.23 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎంటీల) ఉత్పత్తిని సాధించగా, 2021–22లో 50.85 లక్షల ఎంటీల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 11.36 లక్షల ఎంటీల మత్స్యసంపద ఉత్పత్తి అయింది. పంట పండినచోటే మార్కెటింగ్‌తో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు మొత్తం 4,813 ఎంటీల సామర్థ్యంతో 92 ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొత్తం 300 ఎంటీల సామర్థ్యంతో 30 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి.

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలు, రొయ్యలను ప్రాసెస్‌ చేసేందుకు ఇవి సరిపోవడం లేదు. దీంతో పొరుగు రా>ష్ట్రాలకు తరలించాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారు. తోడు సీజన్‌ మొదలుకాగానే అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం వస్తోంది. ఈ పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు ఆక్వాసాగు ఎక్కువగా ఉన్న తీరప్రాంత జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.6.39 కోట్లతో 23 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఒక్కొక్కటి రూ.40 కోట్ల వ్యయంతో 10 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయబోతుంది. కనీసం 2 వేల ఎంటీల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.  

రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతముంది. 54,500 హెక్టార్లలో ఉప్పునీటి, 1.44 లక్షల హెక్టార్లలో మంచినీటి చెరువుల్లో ఆక్వా సాగవుతోంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో
70 శాతం, చేపల్లో 38 శాతం వాటా మన రాష్ట్రానిదే.

ఆక్వారైతుకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం
ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర లభించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగానే ఆక్వా సాగవుతున్న జిల్లాల్లో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం.
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top