జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు

CM YS Jagan Review Meeting On Janata Bazaars Regulations - Sakshi

గ్రేడింగ్, ప్యాకింగ్‌ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి

కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగాలి

రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులూ ఇక్కడ విక్రయించాలి

ఈ బజార్లలో వీటి వినియోగం 30–35 శాతం ఉండాలి

జనతాబజార్ల విధివిధానాలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి:  జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేడింగ్, ప్యాకింగ్‌ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు ఈ బజార్ల ద్వారా తగిన స్థాయిలో మార్కెటింగ్‌ అవకాశాలు లభించాలని.. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలని ఆయనన్నారు. జనతా బజార్ల విధివిధానాలు.. అధికారుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన ఇంకా ఏమన్నారంటే..

► రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను జనతా బజార్లలో విక్రయించేలా చూడాలి.
► కనీసం 20–25 రకాల ఉత్పత్తులు వీటిల్లో అందుబాటులో ఉంచాలి.
► పళ్లు, కూరగాయాలు, గుడ్లు, పాలు, ఆక్వా ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు లభించే ఈ బజార్లలో వీటి వినియోగం 30–35 శాతం ఉండాలి.
► ఇలా అయితే మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మంచి ధరలు వచ్చి లాభం చేకూరుతుంది.
► ఏడాదిలోపు వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.
► గ్రేడింగ్, ప్యాకింగ్‌ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి.
► ఈ బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్‌ అవకాశాలు లభించాలి.
► అలాగే, కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి.
► మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే గ్రేడింగ్, ప్యాకింగ్‌ బాగుండాలి.
► సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలి. మరింత మేధోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలి. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.  

మార్కెట్‌ యార్డుల్లోనూ రైతు బజార్లు 
రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డుల్లోనూ శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభం కానున్నాయి. వాటిలోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న ఆదేశించారు. గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లోని గోడౌన్లకు కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశాలు లేకపోవడంతో వాటిని మినహాయించాలన్నారు.  

వంద యార్డుల గుర్తింపు 
► రాష్ట్రంలోని 216 మార్కెట్‌ కమిటీల పరిధిలో 150 మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు.  
► వాటిలో శనివారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి.  
► వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి.  
► కరోనా వైరస్‌ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. 
► మార్కెట్‌ కమిటీల పరిధిలో ఉండే మేజర్‌ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి.   
అందుబాటులోకి మొబైల్‌ బజార్లు 
► కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100  రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు.  
► వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్‌ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్‌ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top