ఆ గ్యాంగ్‌మన్ ‘ట్రాక్’పై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఆ గ్యాంగ్‌మన్ ‘ట్రాక్’పై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్


 కాకినాడ స్పోర్ట్స్

 రైళ్లు పరుగులు తీసే ట్రాక్ బాగోగులు చూసే ఆ గ్యాంగ్‌మన్.. పరుగుల ట్రాక్‌పై కాలు మోపితే చాలు.. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతాడు.


గుదిబండ లాంటి పేదరికాన్ని విదుల్చుకుని.. గురి చూసి సంధించిన బాణంలా గమ్యాన్ని చేరుకుని, పతకాలు సొంతం చేసుకున్న ఆ వెటరన్  క్రీడాకారుని పేరు తాళ్ళపూడి గోపి. కాకినాడ జగన్నాథపురానికి చెందిన గోపి తండ్రి అప్పారావు మున్సిపాలిటీలో రోలర్ డ్రైవర్. అప్పారావు, పద్మావతి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అవసరాలకే చాలీచాలని ఆదాయంతో నెట్టుకు వస్తున్న ఆ కుటుంబంలో రెండో కుమారుడిగా పుట్టిన గోపి అంకిత భావం, ఓర్పు, పట్టుదల ఉంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చని నిరూపించాడు.


జాతీయస్థాయిలో ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించి అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇంటర్ ఎం.ఎస్.ఎన్. జూనియర్ కళాశాలలో చదివిన గోపి డిగ్రీ పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో చదివాడు. డిగ్రీ చదువుతుండగా అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న అతడు యూనివర్సిటీ స్థాయి పరుగుపోటీల్లో ఒక బంగారు పతకాన్ని, ఒక రజత పతకాన్ని సాధించాడు. 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందెంలో సాధన చేయడం కొనసాగించాడు.


గోపి ప్రతిభను, పట్టుదలను గమనించిన ప్రస్తుత డి.ఎస్.డీ.ఓ వరలక్ష్మి, సీనియర్ అథ్లెట్లు కాంతారావు, చెక్కా రమణ మెళకువలు నేర్పించారు. 2006లో రైల్వేలో గ్యాంగ్‌మన్‌గా ఉద్యోగం వచ్చి భువనేశ్వర్‌లో నియమితుడయ్యాడు. అయినా పరుగును విస్మరించకుండా తీరిక సమయాల్లో సాధన చేసేవాడు. పోటీలకు హాజరయ్యేందుకు తన శాఖ నుంచి ప్రోత్సాహం లేక పోయినా సెలవు పెట్టుకుని పోటీలకు హాజరయ్యేవాడు. 2013లో కాకినాడకు బదిలీ అయ్యాడు. గతనెల 24 నుంచి 27 వరకు కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల 400 మీటర్ల పరుగుపందెంలో బంగారు, 800 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో రజతపతకాలు సాధించాడు. జపాన్‌లో మరికొద్ది నెలల్లో జరగనున్న ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు.


అయితే ఆ పోటీలకు హాజరయ్యేందుకు సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని, అంత సొమ్ము వెచ్చించడం తన వల్ల కాదని గోపి ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. క్రీడాకారుల్ని ప్రోత్సహించే సంకల్పం ఉన్న సంస్థలు లేదా వ్యక్తులు సహకరిస్తే జపాన్ గడ్డ కాకినాడ ఖలేజాను చాటుతానంటున్నాడు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top