బాబుగారి బినామీ లీల.. 106 కోట్ల రుణం ఎగవేత

బాబుగారి బినామీ లీల..  106 కోట్ల రుణం ఎగవేత - Sakshi


మారిషస్ బోనులో సుజనా చౌదరి

 

 మంథా రమణమూర్తి, నూగూరి మహేందర్

 

 చంద్రబాబే కాదు... బాబు కుడి, ఎడమ కూడా పచ్చి మోసమేనన్న వాస్తవం మరోసారి బయటపడింది. తెలుగుదేశంలో కీలకంగా ఉంటూ... అన్నీ తానై నడిపిస్తున్న ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి విదేశీ కుంభకోణం గుట్టు రట్టయింది. సింగపూర్‌తో పాటు పన్ను స్వర్గాలుగా పేరున్న మారిషస్, కేమన్ ఐలాండ్స్, హాంకాంగ్ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను ఏర్పాటు చేసి... వాటి ద్వారా వందల కోట్ల రుణాలు తీసుకుని, ఆ డబ్బును దేశంలోకి తెచ్చి ఇతర అవసరాలకు ఖర్చుబెడుతున్నారన్న ఆరోపణలు నిజమేనని స్పష్టమైంది. మారిషస్‌లో రూ.120 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, ఎగ్గొట్టిన కేసులో... హైదరాబాద్‌లో ఉన్న సుజనా యూనివర్సల్ చరాస్తుల్ని జప్తు చే మాల్సిందిగా సిటీ సివిల్ కోర్టు, 11వ అదనపు న్యాయమూర్తి ఆదేశించారు. కంపెనీకి నోటీసులు జారీ చేస్తూ... ఆ లోగా డబ్బులు విత్‌డ్రా చేస్తే కష్టం కనక ఆ సంస్థకు ఏడు బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను కూడా స్తంభింపజేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో సుజనా చౌదరికి చెందిన మూడు లిస్టెడ్ కంపెనీల్లో ప్రధానమైనదిగా ఉంటున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది.

 

 అసలు ఏం జరిగిందంటే..

 

 గృహోపకరణాల తయారీ రంగంలో ఉన్న సుజనా యూనివర్సల్‌కు పీఏసీ వెంచర్స్ (సింగపూర్), సుజనా హోల్డింగ్స్ లిమిటెడ్ (దుబాయ్), నాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (హాంకాంగ్), సన్ ట్రేడింగ్ లిమిటెడ్ (కేమెన్ ఐలాండ్స్), హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ (మారిషస్) పేరిట విదేశాల్లో పలు అనుబంధ కంపెనీలున్నాయి. వాటి పేర ఏటా వేల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు చూపిస్తుంటారు కూడా. అయితే తమ గ్రూపు సంస్థల లావాదేవీలు చాలావరకూ బోగస్‌వేనని, రుణాల కోసం లేని టర్నోవర్‌ను చూపిస్తుంటామని గతంలో అమ్మకం పన్ను అధికారులకు సుజనా చౌదరే లిఖితపూర్వకంగా చెప్పటం ఈ సందర్భంగా గమనార్హం. హెస్టియా హోల్డింగ్స్ పేరిట కూడా గతేడాది ఏకంగా రూ.199 కోట్ల లావాదేవీలు చూపించారు.

 

 మారిషస్ బ్యాంకు నుంచి రూ.120 కోట్ల రుణం

 

 ఈ కంపెనీ 2010 నవంబరు 9న మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి కోటి డాలర్ల (దాదాపు 60 కోట్లు) రుణం తీసుకుంది. దీనికి సుజనా యూనివర్సల్ సంస్థ గ్యారెంటీ ఇచ్చింది. కొన్నాళ్లు రుణవాయిదాలు సవ్యంగానే చెల్లించిన సుజనా చౌదరి... తనకు మరింత రుణం కావాలని అదే బ్యాంకును కోరారు. దీంతో 2011లో ఈ రుణాన్ని 2కోట్ల డాలర్లకు (దాదాపు 120 కోట్లకు) పెంచుతూ మారిషస్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రుణ ఒప్పందాన్ని సవరించింది కూడా. అయితే 2012 జూన్ నాటికి మొత్తం 120 కోట్ల రూపాయలనూ విత్ డ్రా చేసుకున్న సుజనా చౌదరి... అప్పటి నుంచి రుణాన్ని తిరిగి చెల్లించటం మానేశారు. 2012 ఆగస్టు నాటికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టారు.

 

 మళ్లీ మళ్లీ అదే ఎగవేత ధోరణి...

 

 చెల్లించాల్సిన రుణాన్ని ఎగ్గొట్టడంతో మారిషస్ బ్యాంకు నోటీసులిచ్చింది. చివరకు హెస్టియా-సుజనా- మారిషస్ బ్యాంకు కలిసి పాత ఒప్పందాన్ని సవరిస్తూ మరో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం చెల్లించాల్సిన గడువును బ్యాంకు పెంచింది. కానీ ఆ గడువులోగా కూడా సుజనా చౌదరి చెల్లింపులు చేయనేలేదు. దాదాపు రూ.102 కోట్లు బకాయి పడ్డారు. ఎప్పటికీ చెల్లించకపోవటంతో బ్యాంకు కోర్టుకెళ్లింది. సుజనా యూనివర్సల్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ఆ సొమ్ము వసూలు చేసుకోవచ్చంటూ మారిషస్ కోర్టు బ్యాంకుకు డిక్రీ ఇచ్చింది. ఆ డిక్రీ ఆధారంగా హైదరాబాద్ సివిల్ కోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు కేసు దాఖలు చేయటంతో... సుజనా కార్యాలయంలోని చరాస్తులన్నిటినీ జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. దీన్ని పర్యవేక్షించడానికి బెయిలిఫ్‌ను కూడా నియమించింది. అంతేకాక సుజనా సంస్థకు నోటీసులిస్తూ... ఈ నెల 28లోగా దీనికి సమాధానం చెప్పాలని గడువిచ్చింది. ఈ సంస్థ గనక తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును విత్ డ్రా చేస్తే పిటిషనర్‌కు న్యాయం జరగదని భావించిన న్యాయస్థానం... అప్పటిదాకాా సుజనా యూనివర్సల్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లలో ఉన్న ఖాతాలను స్తంభింపజేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

 

 చెల్లించాల్సిన సొమ్ము రూ.106 కోట్లు

 

 మారిషస్ కోర్టు ఇచ్చిన డిక్రీ ప్రకారం సుజనా చౌదరి మారిషస్ బ్యాంకుకు చెల్లించాల్సిన సొమ్ము రూ.102 కోట్లు. దానికి వడ్డీ, కోర్టు ఖర్చులు కలిపి మొత్తం రూ.106 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికోసం బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయటంతో పాటు పంజాగుట్ట, నాగార్జున హిల్స్‌లో ఉన్న సుజనా యూనివర్సల్ కార్యాలయంలోని కంప్యూటర్లు, ఏసీలు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, ప్రింటర్లు, ఫోన్లను అటాచ్ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.

 

 అరెస్టు చేసే అవకాశం?

 

 రూ.106 కోట్ల రుణం ఎగవేసిన కేసులో సుజనా చౌదరికి నోటీసులిస్తూ ఈ నెల 28 వరకూ కోర్టు గడువిచ్చింది. దీనిప్రకారం 28లోగా ఆయన కోర్టుకు హాజరై... తాము రుణం ఎలా చెల్లిస్తామన్నది చెప్పాల్సి ఉంటుంది. ‘‘సుజనా యాజమాన్యం చెప్పే సమాధానంతో డిక్రీ హోల్డరు సంతృప్తి చెందితే సరే! లేనిపక్షంలో వారు డిక్రీ అమలు కోసం ఆయన్ను అరెస్టు చేయటానికి అనుమతివ్వాలని కూడా కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ విషయంలో డిక్రీ హోల్డరుదే అంతిమ నిర్ణయమవుతుంది’’ అని న్యాయ నిపుణులు చెబుతుండటం గమనార్హం.

 

 అంత రుణమెలా ఇచ్చారు?

 

 నిజానికి సుజనా యూనివర్సల్ సంస్థ ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవరైతే చూపిస్తుంది కానీ... లాభాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. చాలా వరకూ నష్టాలే నమోదు చేస్తుంటుంది. అందుకే షేర్ మార్కెట్లో కూడా ఈ సంస్థ షేరు నానాటికీ కిందకి పడిపోయి... ప్రస్తుతం రూపాయి పావలా దగ్గర ట్రేడవుతోంది. ఈ ధర వద్ద దీని నికర విలువ కేవలం రూ.21 కోట్లు. అంటే సంస్థ మొత్తం వాటాలన్నీ కలిపితే దాని విలువ రూ.21 కోట్లు. దీన్లోనూ యాజమాన్యం చేతుల్లో ఉన్నది 26 శాతం షేర్లే. మరి 21 కోట విలువైన సంస్థను చూసి రూ.120 కోట్ల రుణమెలా ఇచ్చారు? ఈ సంస్థ కూడా ఏ ధైర్యంతో తీరుస్తామనుకుంది? ఆ డబ్బును సుజనా చౌదరి ఏం చేశారు? ఇవన్నీ ఇపుడు ప్రశ్నలే. పెపైచ్చు సుజనాచౌదరికి ఈ సంస్థలో 26 శాతం వాటా ఉంది. దాని విలువ కేవలం రూ.ఐదారు కోట్లు. అలాంటి వ్యక్తి వందల కోట్ల మేర రుణాలు తీసుకుని వాటిని ఏం చేశారన్నది ఆద్యంతం మిస్టరీగానే కనిపిస్తోంది.

 

 

 ఇదీ మారిషస్ కంపెనీ చిరునామా...

 సూట్-జీ12, సెయింట్ జేమ్స్ కోర్ట్,

 సెయింట్ డెనిస్ స్ట్రీట్, పోర్ట్ లూయిస్, మారిషస్.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top