సింహపురి స్వతంత్ర సింహాలు

Successful Independent Candidates In PSR Nellore - Sakshi

జిల్లాలో 16 మంది స్వతంత్ర అభ్యర్థుల విజయం

జాతీయ చిత్రపటంలో ధాన్యసిరిగా ప్రసిద్ధిచెందిన సింహపురిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. దేశ రాజకీయాల్లో వెలుగువెలిగిన ఎందరో ఉద్దండులకు రాజకీయ జీవితాన్నిచ్చిన నెల్లూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి జరిగిన సాధారణ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున కాకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి విజయం సాధించిన వారు ఉన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత చాటిన బెజవాడ కుటుంబం నుంచి పాపిరెడ్డి, నలపరెడ్డి శ్రీనివాసులురెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులు స్వంతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి అసెంబ్లీలో తమ వాణి వినిపించారు.

సాక్షి, నెల్లూరు: ఏపీలో తొలిసారి ఎన్నికల నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో 16 మంది స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇండిపెండెంట్‌ విజేతలు వీరే..
1952లో  జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి జీటీ నాయుడు, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా జీసీ కొండయ్య పోటీ పడ్డారు. ఈ నియోజకవర్గంలో  మొత్తం 59,021 మంది ఓటర్లు ఉండగా 31,243 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీటీ నాయుడుకు 10,560 ఓట్లు రాగా, ఇండిపెండింట్‌ అభ్యర్థి జీసీ కొండయ్యకు 20,682 ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు.
 కావలి నియోజకవర్గంలో 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున జేసీ కొండయ్య, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా జి.సుబ్బానాయుడు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 24,231 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి సుబ్బానాయుడికి 26,540 ఓట్లు లభించి విజయం సాధించారు.
కావలి నియోజకవర్గంలో 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఏపీవీరెడ్డిపై మరో స్వతంత్ర అభ్యర్థి జి.కొండపనాయుడు విజయం సాధించారు. ఏపీవీ రెడ్డికి 21,442 ఓట్లు రాగా, కొండపనాయుడుకు 27,874 ఓట్లు వచ్చాయి.
 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో  కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.మునిస్వామిపై స్వతంత్ర అభ్యర్థిగా పిట్ల వెంకటసుబ్బయ్య పోటీ చేసి విజయం సాధించారు. మునిస్వామికి 22,987 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 24,840 ఓట్లు లభించాయి. 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.సిద్ధయ్యనాయుడుపై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సిద్ధయ్యనాయుడికి 25,751 ఓట్లు రాగా, పి రామచంద్రారెడ్డికి 33,126 ఓట్లు లభించాయి.  1952లో  సాధారణ ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏసీఎస్‌రెడ్డి,  కె.చిన్నయ్యపై ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కె.కృష్ణారావు, స్వర్ణ వేమయ్య విజయం సాధించారు. 
1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.కృష్ణయ్యపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒ.వెంకటసుబ్బయ్య విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కృష్ణయ్యకు 23,197 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 31,193 ఓట్లు లభించాయి
 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోవి రామయ్యచౌదరిపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి ధనేకుల నరసింహం విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రామయ్య చౌదరికి 19,826 ఓట్లు లభించగా, ధనేకుల నరసింహంకు 29,500 ఓట్లు వచ్చాయి.
1967లో జరిగిన ఎన్నికల్లో అల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి వి.విమలాదేవిపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి బెజవాడ పాపిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విమలాదేవికి 13,389 ఓట్లు రాగా పాపిరెడ్డికి 32,822 ఓట్లు లభించాయి.
 1962లో జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి వీకే రెడ్డిపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి వి.వెంకురెడ్డి విజయం సాధించారు. వీకే రెడ్డికి 23,355 ఓట్లు రాగా వెంకురెడ్డికి 23,441 ఓట్లు లభించాయి.
♦ 1955లో జరిగిన ఎన్నికల్లో నందిపాడు నియోజకవర్గం నుంచి కేఎల్‌పీ అభ్యర్థి ధనేకుల నరసింహంపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి కె విజయరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధనేకుల నరసింహంకు 9,251 ఓట్లు రాగా కేవీ రెడ్డికి 11,137 ఓట్లు లభించాయి.

శారదాంబపై నల్లపరెడ్డి విజయం
 1972లో జరిగిన ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి టీకే శారదాంబపై  ఇండిపెండెంట్‌ అభ్యర్థి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శారదాంబకు 27,015 ఓట్లు రాగా,  శ్రీనివాసులురెడ్డికి 40,057 ఓట్లు లభించాయి.

కంభం విజయకేతనం
 1994 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మాదాల జానకిరాంపై ఇండిపెండింట్‌ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి విజయం  సాధించారు. ఆ ఎన్నికల్లో జానకిరాంకు 26,793 ఓట్లు రాగా, కంభం విజయరామిరెడ్డికి  51,712 ఓట్లు లభించాయి.

జేకే రెడ్డి సంచలనం
∙1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్‌రెడ్డిపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి జక్కా కోదండరామిరెడ్డి (జేకే రెడ్డి) సంచలన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రమేష్‌రెడ్డికి 42,092 ఓట్లు రాగా, జేకే రెడ్డికి 56,566 ఓట్లు లభించాయి.

నువ్వుల విజయం
♦ 1972లో జరిగిన సా«ధారణ ఎన్నికల్లో  రాపూరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కాకాణి రమణారెడ్డిపై మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థ్ధి నువ్వుల వెంకటరత్నంనాయుడు విజయం సాధిం చారు. రమణారెడ్డికి 20,863 ఓట్లు రాగా, వెంకటరత్నంనాయుడుకు 28,637 ఓట్లు లభించాయి.

బొల్లినేనిపై కొమ్మి విజయం
ఆత్మకూరు నియోజకవర్గంలోని 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరుపున బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి పోటీచేశారు. త్రిముఖ పోటీలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు విజయం సాధించారు. బొల్లినేని కృష్ణయ్యకు 38,950 ఓట్లు రాగా, ఇండిపెండెంట్‌ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడుకు 43,347 ఓట్లు లభించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top