మొండిచేయి | subsidy money not yet credit to their accounts | Sakshi
Sakshi News home page

మొండిచేయి

Jul 22 2014 3:02 AM | Updated on Sep 2 2017 10:39 AM

వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరైన లబ్ధిదారులకు నెలలు గడుస్తున్నా..సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ కావడం లేదు.

ఒంగోలు సెంట్రల్: వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరైన లబ్ధిదారులకు నెలలు గడుస్తున్నా..సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. సమైఖ్య రాష్ట్రంలో మంజూరు చేసిన రుణాలకు అవసరమైన నిధులను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదా అనేది అంతు చిక్కడం లేదు. అదే విధంగా రాష్ట్రం విడిపోయినా గిరిజన కార్పొరేషన్ మాత్రం రెండు రాష్ట్రాలకు ఒక్కటిగా ఉండటంతో నిధుల విడుదలకు తీవ్ర అడ్డంకిగా మారింది.  2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల కింద జిల్లాలో మొత్తం మీద రూ.25.15 కోట్ల సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది.
 
 - 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 1963 మంది ఎస్సీలకు రూ.36.69 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వారికి సబ్సిడీ కింద రూ.16.80 కోట్లు రావాల్సి ఉంది.
 ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. వీరికి రాయితీ మంజూరైనా..నిధులు విడుదల కాకపోవడంతో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. ఫలితంగా మంజూరు పత్రాలతో లబ్ధిదారులు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
 - నిరుద్యోగ బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తోంది. 2013-14 సంవత్సరానికి గానూ 1349 మందికి రూ.13.80 కోట్ల రుణాలు అందించడానికి అధికారులు నిర్ణయించారు. అయితే మంజూరైన వారికి ఇంత వరకూ సబ్సిడీలు విడుదల కాలేదు. రూ.6.50 కోట్లకు పైగా సబ్సిడీ నిధులు మంజూరు చేయాల్సి ఉండగా ఇంత వరకూ మంజూరు చేయలేదు.
 - ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితి ఘోరంగా తయారైంది. రాష్ట్ర విభజన జరిగి రెండు నెలలు గడుస్తున్నా..ఇంత వరకూ కార్పొరేషన్‌ను విభజన జరగలేదు. దీంతో రుణాలు, సబ్సిడీలు వచ్చే ఏడాదికైనా మంజూరవుతాయా అనేది సందేహమే. మొత్తం 350 మందికి రూ.3.15 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వీరికి రూ.1.85 కోట్ల సబ్సిడీ ఇవ్వాలి. అయితే సబ్సిడీ మంజూరు కాకపోవడంతో బ్యాంకులు రుణాలిచ్చేందుకు అంగీకరించడం లేదు. రాయితీ వస్తే తప్ప రుణం ఇవ్వమని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు.
 - రుణాల సబ్సిడీలు రాకపోవడంపై..ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.రాజు మాట్లాడుతూ లబ్ధిదారులకు సబ్సిడీలు మంజూరయ్యాయని, అయితే ఇంకా అవి వారి ఖాతాల్లో జమకాలేదన్నారు.
 - ఎస్టీ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ విభజన జరగకపోవడంతో రాయితీలు మంజూరు కాలేదన్నారు. ఈ విషయమై 17వ తేదీ హైదరాబాద్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సమావేశం నిర్వహించారని, సబ్సిడీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement