‘జ్ఞాన’ బోరు!

Students Suffered Chandrababu naidu JnanaBheri - Sakshi

‘జ్ఞానభేరి’లో గంటన్నరసేపు సీఎం ఉపన్యాసం

ఎన్నికల ప్రసంగాన్ని తలపించిన బాబు

సొంత బాకాకే ఎక్కువ సమయం

ముఖాముఖీ రద్దుతో నిరాశపడ్డ విద్యార్థులు

సాక్షి, విశాఖపట్నం: దాదాపు పక్షం రోజుల నుంచి ఊదరగొట్టారు. ‘జ్ఞానభేరి’ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖీ ఉంటుందని మంత్రుల నుంచి అధికారుల వరకు ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల విద్యార్థులను విధిగా తరలించాలని ఆయా యాజమాన్యాలకు హుకుం జారీ చేశారు. 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కానీ ఏం జరిగింది? జిల్లా నలుమూలల నుంచి తరలించినా ఈ కార్యక్రమానికి సగం మంది కూడా రాలేదు. విద్యార్థుల కోసం 24 బ్లాకులను ఏర్పాటు చేశారు. ఏవో కొన్ని బ్లాకులు తప్ప చాలా బ్లాకుల్లో అరకొరగానే నిండాయి. సదస్సు మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేదిక వద్దకు 4 గంటల వరకు రాలేదు. అప్పటిదాకా సాంస్కృతిక కార్యక్రమాలతోను, గరికపాటి నరసింహారావు ఉపన్యాసాలతోనూ నడిపించారు. విద్యార్థులు విసుగు చెందకుండా కొంతమంది ఎంపిక చేసిన విద్యార్థులతో వేదికపై నుంచి ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తేలా మాట్లాడించారు. తొలుత ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందే ముఖాముఖీ ఉంటుందని విద్యార్థులు భావించారు.

అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి 4.35 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి గంటన్నర పాటు కొనసాగించారు. ఇందులో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే వాటికంటే తాను చేపట్టిన పథకాలు, హైదరాబాద్‌కు చేసిన అభివృద్ధి, హైటెక్‌ సిటీ,  సెల్‌ఫోన్లను తీసుకురావడం, రాష్ట్రంలో రోడ్లు వేయించడం, మరుగుదొడ్ల మంజూరు వంటి పొంతనలేని అంశాలకే ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు–లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై టూకీగా మాట్లాడారు. పరిశోధనలకు నిధులు ఇవ్వడం, సాంకేతిక కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారికి హామీలు గానీ ప్రకటించలేదు. జ్ఞానభేరి కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల తమకేం ఒరిగిందని విద్యార్థులు నిట్టూర్చారు. తాను మళ్లీ పుడితే ఏయూలో విద్యార్థిగా చేరే అవకాశం కల్పించాలని దేవుడిని అడుగుతానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మంది విద్యార్థులకు రుచించలేదు.

అలాగే పిల్లలను అపరిమితంగా కనాలంటూ తమకు జ్ఞానభేరి వేదికపై హితబోధ చేయడమేమిటని విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగం అనంతరం ముఖాముఖి ఉంటుందనుకుని సర్దుబాటు చేసుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో అంతా నిరాశ చెందారు. పలువురు విద్యార్థులు సీఎంతో ఏఏ అంశాలు మాట్లాడాలన్న దానిపై సిద్ధమై వచ్చారు. కానీ విద్యార్థులు సంధించే ప్రశ్నలకు అందరి సమక్షంలో సరైన సమాధానం చెప్పకపోతే జ్ఞానభేరి అభాసు పాలవుతుందన్న ఉద్దేశంతో ముఖాముఖీ రద్దు చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ సదస్సుకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తామని కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో భోజనాలు పెట్టలేకపోయారు. దీంతో పలువురు ఉస్సూరుమనుకుంటూ మధ్యాహ్నానికే వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఆకట్టుకున్న స్టాల్స్‌
వేదిక వద్ద ప్రసంగాలు విద్యార్థులకు నీరసం తెప్పించాయి. ఇదాలా ఉంటే  అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ మాత్రం జనాన్ని ఆకర్షించాయి. వినూత్నమైన ఆలోచనలతో విద్యార్థులు రూపొందించిన స్టాళ్లను చూసేందుకు అంతా క్యూ కట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top