వసతికి దూరం

Students accommodation in Nidadavolu - Sakshi

వసతి కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోన్న లక్షలాది రూపాయల లబ్ధి పేద విద్యార్థినులకు చేరడం లేదు. ప్రైవేట్‌ వ్యక్తులు ఆయా భవనాల్లో పాగా వేసి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చి కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు వసతి అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో యూజీసీ నిధులతో నాలుగు కళాశాలల్లో నిర్మించిన బాలికల వసతి గృహాలు అక్కరకురావడం లేదు.

నిడదవోలు : జిల్లాలోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిధులతో వసతి గృహాలను నిర్మించారు. వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఉపయోగంలోకి రావడం లేదు. కొన్నిచోట్ల ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు చొరవచూపడం లేదు.
నిడదవోలు.. యోగా క్లబుల ఆక్రమణ : నిడదవోలు వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.60 లక్షల యూజీసీ నిధులతో వసతి గృహాన్ని నిర్మించారు. రెం డు అంతస్తుల భవనంలో కింద అంతస్తులో నాలుగు విశాలమైన గదులు, పైన అంతస్తులో రెండు విశాల గదులతో పాటు డైనింగ్‌ హాల్‌ నిర్మించారు. భవనాన్ని ప్రారంభించి రెం డేళ్లు గడస్తున్నా విద్యార్థినులకు వసతి కల్పించలేదు. హాస్టల్‌ నిరుపయోగంగా ఉండటంతో కొందరు  సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు ఉదయం వేళలో వ్యాయామం, యోగా శిక్షణ తరగతుల నిర్వహించుకుం టున్నారు. పట్టణంలోని రెండు యోగా క్లబ్‌ల సభ్యులు అనధికారంగా మూడు గదులను సొంత అవసరాలకు వాడుకుం టున్నాయి. వారి వస్తువులు, వ్యాయామ యంత్రాలను కూ డా ఇక్కడే ఉంచడంతో పాటు వసతి గృహ తలుపులకు తా ళాలు సైతం వేస్తున్నారు. మరుగుదొడ్లకు కూడా తాళాలు వేయడంతో కనీసం ఇవి కూడా విద్యార్థినులకు ఉపయోగపడటం లేదు. రాత్రిళ్లు కొందరు యువకులు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్‌ తలుపులు, కిటికీలు ధ్వంసమవుతున్నాయి.

నిడదవోలు ఎస్వీఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతి గృహాన్ని రూ.20 లక్షలతో నిర్మించారు. ఇక్కడా విద్యార్థులకు వసతి కల్పించలేదు. దీంతో వీటిని తరగతి గదులుగా ఉపయోగిస్తున్నారు.

పాలకొల్లులో కుట్టు శిక్షణ కేంద్రం
పాలకొల్లు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధులు రూ.70 లక్షలతో వసతి గృహం నిర్మించారు. ఇక్కడా ఒక్క విద్యార్థినికి కూడా వసతి కల్పించలేదు. ప్రస్తుతం కాపు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 80 మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు.

తాడేపల్లిగూడెం.. నిరుపయోగం
తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధలు రూ.50 లక్షలతో ఎనిమిది గదుల భవనాన్ని నిర్మించారు. భ వనం నిరుపయోగంగా ఉండటంతో సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది.

తణుకు.. నిధుల కొరత
తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధులు రూ.11.28 లక్షలతో చేపట్టిన వసతి గృహం నిధులు సరిపోకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. యూజీసీ నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు చొరవచూపి ఉపయోగంలోకి తీసుకురావాలని విద్యార్థినులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి
గోపాలపురం మండలం జగన్నాథపురం నుంచి వచ్చి ఇక్కడ బీజెడ్‌సీ చదువుతున్నా. రోజూ రాకపోకలకు ఇబ్బంది పడుతున్నా. సమయానికి తరగతులకు హాజరుకాలేకపోతున్నా. వసతి గృహాన్ని వినియోగంలో కి తీసుకువచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– కేందేటి లక్ష్మి, బీఎస్సీ, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు

డైనింగ్‌ గదులు కేటాయించాలి
ఇంటర్, డిగ్రీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడి నుంచి వస్తున్నా. హాస్టల్‌ ప్రారంభిస్తే ఇక్కడే ఉండి చదువుకుంటాను. అప్పటివరకు కనీసం డైనింగ్‌ హాల్, విశ్రాంతి గదులు అయినా కేటాయించాలి.
– ఎస్‌.దీపిక, బీకాం, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు

యోగాకు అనుమతి ఇవ్వలేదు
వసతిగృహంలో కొందరు వ్యాయామ, యోగా తరగతులు నిర్వహించడం వాస్తవమే. అయితే బయట వ్యక్తులకు ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. వెం టనే ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుం టాం. హాస్టల్‌ వినియోగంలోకి వచ్చేలా చూస్తాం.
– వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, ఎస్వీడీ మహిళా కళాశాల, నిడదవోలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top