విద్యార్థి రవితేజ పరిస్థితి విషమం | Student Ravitheja Danger situation In GGH | Sakshi
Sakshi News home page

విద్యార్థి రవితేజ పరిస్థితి విషమం

Jul 10 2018 1:35 PM | Updated on Jul 10 2018 1:35 PM

Student Ravitheja Danger situation In GGH - Sakshi

తీవ్ర గాయాలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థి రవితేజను పరామర్శిస్తున్న ఆర్జేడీ కేవీ శ్రీనివాసులురెడ్డి

గుంటూరు మెడికల్‌: ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి తన ప్రియురాలికి లేఖ అందజేయలేదన్న కోపంతో ఏడో తరగతి విద్యార్థిపై పెట్రోలు పోసి తగులబెట్టిన ఘటనలో బాధిత విద్యార్థి తీవ్ర గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అంకభూపాలెం గ్రామానికి చెందిన మెట్ల శేఖర్, వెంకటలక్ష్మి దంపతుల పెద్ద కొడుకు రవితేజ (13) అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం జీజీహెచ్‌కి వచ్చిన పలువురు ఉపాధ్యాయులు.. చదువుతో పాటు అన్నింటా చురుగ్గా ఉండే రవితేజను కాలిన గాయాలతో చికిత్స పొందుతుండటం చూసి కంటతడి పెట్టారు. ఆర్జేడీ కె.వి.శ్రీనివాసులురెడ్డి, గుంటూరు ఎంఈఓ ఖుద్దూస్,  ఉర్దూ స్కూల్స్‌ డీఐ ఖాశీంలు జీజీహెచ్‌కు వచ్చి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థికి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయని, బతకడం కష్టమనే విషయాన్ని జీజీహెచ్‌ వైద్యులు తేల్చిచెప్పారు.

శేఖర్‌ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, రెండో కుమారుడు రాజమోహన్‌ 4వ తరగతి, కుమార్తె రాజస్రవంతి 2వ తరగతి చదువుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న శేఖర్‌ దంపతులు తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్‌లో మూడు రోజులుగా గుండెలవిసేలా రోదిస్తుండటం చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది. పాఠశాల, కళాశాల ఒకే ఆవరణలో ఉండటంతో ఇంటర్‌ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రత్యేక్ష సాక్షి అయిన ఓ ఉపాధ్యాయుడు సోమవారం జీజీహెచ్‌లో మీడియాకు తెలిపారు. కేవలం ఇంటర్‌ విద్యార్థి 7వ తరగతి విద్యార్థిపై ఇలా ఘటనకు పాల్పడడంపై మానసిక వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement