గుంటూరు: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద గ్రీవెన్స్ భవన్‌లో మంగళవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైన దృష్ట్య పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బధవారం వరకు కొనసాగే సదస్సుకు ముందురోజు నుంచే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను అదనంగా మొహరించారు. పరిసర ప్రాంతాలతో పాటు సమీపంగా ఉన్న పొలాల్లో సైతం బలగాలు జల్లెడ పట్టాయి. కరకట్ట పొడవునా పోలీసులను మొహరించారు. ఉండవల్లి ప్రధాన మార్గం వెంట కూడా పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం అనుమతులు ఇచ్చారు.
ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా నిమిషాల్లో చేరుకునేలా మొబైల్ పార్టీలతో పాటు బాండ్ అండ్ డాగ్ స్క్వాడ్‌లను సిద్ధంగా ఉంచారు. మొత్తం 336 మందిని బందోబస్తుకు కేటాయించారు. బందోబస్తు ఏర్పాట్లను హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప స్వయంగా పరిశీలించి అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావుకు పలు సూచనలు ఇచ్చారు. హోంమంత్రి ఆదేశాల మేరకు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీలు జి.రామాంజనేయులు, మూర్తి, ప్రసాద్, జి.శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, తదితరలు ఉన్నారు.


