జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
నేల కొరిగిన చెట్లు, విద్యుత్ తీగలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
జిల్లాలో పలుచోట్ల వర్షాలు
రేపల్లె : జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి మేఘాలు ఆవరించి ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు కురిశాయి. గుంటూరు నగరంతోపాటు ప్రత్తిపాడు, పెదనందిపాడు, తెనాలి, రేపల్లె తదితర ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ముఖ్యంగా రేపల్లె పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించింది.
వర్షానికి తోడు కొద్దిసేపు బలమైన గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఉదయం నుంచి వడగాడ్పులు వీయగా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మబ్బులు ఆవహించి క్షణాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలివానకు పట్టణంలో పండ్ల మార్కెట్ సెంటర్‌లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. అదే పలు చోట్ల షాపుల రేకులు లేచి దూరంగా పడ్డాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటంతో బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా వాహనాల రాకపోకలను మళ్లించారు. నిలిచిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఆశాఖ అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు.