రూమ్‌మేటే దొంగ.. !

Stole Nearly Rs 80000 From His Roommates Account Through The Mobikwick App - Sakshi

యాప్‌ ద్వారా రూ.80 వేలు కాజేశాడు

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): వారిద్దరూ రూమ్‌మేట్‌లు. అందులో ఒకరు రెండో వ్యక్తి ఖాతా నుంచి దాదాపు రూ.80 వేలను మొబిక్విక్‌ అనే యాప్‌ ద్వారా దొంగిలించాడు. ఫోన్‌కు వచ్చే ఓటీపీలను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసేసేవాడు. ఈ క్రమంలో వచ్చిన ఓ మెసేజ్‌ను గుర్తించిన బాధితుడు బ్యాంక్‌ అధికారులను సంప్రదించాడు. ఖాతా నుంచి రూ.80 వేలు విత్‌డ్రా అయినట్టు చెప్పడంతో లబోదిబోమన్నాడు. సమాచారం అందుకున్న సైబర్‌ క్రైం పోలీసులు.. ఆ యువకుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్‌ క్రైం సీఐ వి.గోపీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఇసుకతోట రామ మందిరం వీధికి చెందిన చందక భాస్కరరావుకు తన ఎస్‌బీఐ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నంబర్‌కు ‘మీ ఏటీఎం కార్డు పీవోఎస్‌/ఈ కామర్స్‌ లావాదేవీలకు వాడుతున్నారు. దయచేసి వెంటనే మీ కార్డును బ్లాక్‌ చేయండి’ అని మెసేజ్‌ వచ్చింది. అనుమానం వచ్చిన ఆయన బ్యాంకు అధికారులను కలిశారు.

దీంతో బ్యాంకు సిబ్బంది ఈ ఖాతా నుంచి జూలై 7 నుంచి 11వ తేదీ వరకు రూ.80 వేలు విత్‌ డ్రా అయ్యాయని ఆయనకు తెలిపారు. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇసుకతోట ప్రాంతానికి చెందిన బొద్దు స్వాతి కిరణ్‌ అలియాస్‌ సాయిగా గుర్తించారు. భాస్కరరావు, సాయిలు రూమ్‌మేట్‌లు. నిందితుడు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఓసారి బాధితుడి వద్ద నుంచి ఫోన్‌ కావాలని తీసుకున్నాడు. ఫోన్‌ మాట్లాడిన తర్వాత.. మొబిక్విక్‌ యాప్‌లో తను నంబర్‌ను యాడ్‌ చేసుకున్నాడు. తరచూ ఫోన్‌ తీసుకుని డబ్బులను యాప్‌ ద్వారా తన ఖాతాకు పంపించుకునేవాడు. వచ్చిన ఓటీపీని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసేవాడు. ఈ క్రమంలో వచ్చిన ఓ మేసేజ్‌తో బాధితుడు బ్యాంక్‌ అధికారులను ఆశ్రయించడం, తర్వాత సైబర్‌ క్రైం పోలీసుల రంగప్రవేశంతో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని ఖాతాను ఫ్రీజ్‌ చేసి, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top