రాజధానిలో భూమి తీసుకో..అమ్ముకో

State Govt Subsidies rain to the Private Company - Sakshi

అమరావతిలో రూ.160 కోట్ల విలువైన 40 ఎకరాల భూమి రూ.20 కోట్లకే పందేరం

రూ.250 కోట్ల విలువైన అదనపు రాయితీలు

దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోపే కేటాయిస్తూ జీవో విడుదల

భూమి విక్రయించుకునే, లీజుకు ఇచ్చుకునే హక్కులు 

సాక్‌ట్రానిక్స్‌ కంపెనీపై అమితమైన ప్రేమ కురిపించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే చిప్‌ డిజైనింగ్‌ కంపెనీ సాక్‌ట్రానిక్స్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నాలుగు అంతస్థుల భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి రాజధాని అమరావతిలో 40 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించింది. రూ.160 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.20 కోట్లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఎకరం భూమి ధరను ప్రభుత్వమే రూ.4 కోట్లుగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, సాక్‌ట్రానిక్స్‌కు ఎకరం కేవలం రూ.50 లక్షలకే కేటాయిస్తూ హాడావిడిగా ఉత్తర్వులను జారీ చేసింది. విలువైన భూమి కేటాయించడమే కాకుండా పూర్తిగా అమ్ముకోవడానికి లేదా లీజుకు ఇచ్చుకోవడానికి హక్కులు సైతం కల్పించడం గమనార్హం. 

అమరావతిలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సాక్‌ట్రానిక్స్‌ దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే శరవేగంతో ఫైల్‌ ముందుకు కదిలింది. ఆ సంస్థకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమిని కేటాయించడమే కాకుండా భారీగా రాయితీలు కల్పించడం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో వేలం విధానంలోనే ప్రైవేట్‌ కంపెనీలకు భూ కేటాయింపులు చేయాలని ఏపీసీఆర్‌డీఏ స్పష్టంగా చెపుతోంది. కానీ, దాన్ని పక్కన పెట్టి సాక్‌ట్రానిక్స్‌కు భూ కేటాయింపులు చేయడం గమనార్హం. 

రాయితీల్లోనే రూ.250 కోట్ల లబ్ధి 
2014–2020 ఎలక్ట్రానిక్స్‌ పాలసీ ప్రకారం లభించే రాయితీలే కాకుండా ఇంకా అదనపు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు రాయితీల విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. కేవలం ఒక్క భూమిపైనే రూ.140 కోట్ల ప్రయోజనం నేరుగా లభించింది. ఇవికాకుండా ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం గ్రాంట్‌గా ఎకారానికి గరిష్టంగా రూ.30 లక్షలతోపాటు అన్ని గ్రాంట్‌లు కలిపి గరిష్టంగా రూ.50 కోట్లకు వరకు ఇచ్చారు.

ఈ విషయాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్‌ కన్వర్జేషన్‌ చార్జీల నుంచి సైతం మినహాయింపు ఇచ్చారు. ఆంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో 54 ఎకరాల్లోనే అతిపెద్ద క్యాంపస్‌ నిర్మించింది. ఒక చిన్న చిప్‌ కంపెనీకి రాజధాని అమరావతిలో ఏకంగా 40 ఎకరాలు కేటాయిచండమే కాకుండా, ఇతరులకు అమ్ముకునే హక్కును కూడా కల్పించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top