
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
21.74 ఎకరాల కేటాయింపు తుది తీర్పునకు లోబడే ఉంటుంది
మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ఉన్నత న్యాయస్థానం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి 21.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు 99 పైసలకు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ భూకేటాయింపులు తమ తుదితీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
కేటాయింపుల ఉత్తర్వులను కొట్టేయాలంటూ పిల్
విశాఖపట్నంలో టీసీఎస్‌కు ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు రూ.529 కోట్ల విలువైన 21.74 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ, ఎన్విరాన్‌మెంటల్ రైట్స్ సంస్థ జిల్లా అధ్యక్షురాలు నమ్మిగ్రేస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జీవో 7ను రద్దు చేయడంతో పాటు ఆ జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ భూ కేటాయింపులు జరిగాయన్నారు. నిబంధనల ప్రకారం 33 ఏళ్లు, 66 ఏళ్లకు భూమి కేటాయించవచ్చునని, కంపెనీ పెట్టి విజయవంతంగా నడిపితేనే ఆ లీజును 99 ఏళ్లకు పొడిగించవచ్చని చెప్పారు. నిబంధనల్లో ఎక్కడా కూడా భూమి అమ్మకం గురించి లేదని, కానీ ప్రభుత్వం టీసీఎస్‌కి ఈ 21.74 ఎకరాల భూమిని అమ్మకం ద్వారా కేటాయిస్తోందని తెలిపారు.
విశాఖలో టీసీఎస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ధర్మాసనం ప్రశ్నించగా.. 12 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మరి టీసీఎస్ లే ఆఫ్‌లు చేస్తోందిగా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. కేవలం లీజు ప్రాతిపదికనే టీసీఎస్‌కు భూ కేటాయింపులు చేస్తున్నామని, అమ్మడం లేదని తెలిపారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ విషయం అస్పష్టంగా ఉందని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీసీఎస్‌కు చేసిన భూ కేటాయింపులు తమ తుదితీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.