
సాంకేతికతను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేస్తున్న ఇస్రో
జైపూర్ ఫుట్ మొదలుకొని 550కుపైగా సాంకేతికతలు
2020–24 మధ్య రూ.2,000 కోట్లకుపైగా లాభం
దివ్యాంగులకు వరమైన జైపూర్ ఫుట్ సాంకేతికత.. వరదల సమయంలోనూ, వ్యవసాయంలోనూ.. ఇలా అనేక సందర్భాల్లో అక్కరకొచ్చే లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) టెక్నాలజీ.. మంటల నుంచి రక్షించే సెరామిక్ ఆధారిత పూత..
ఇలాంటి ఎన్నో అద్భుతమైన సాంకేతికతలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో తయారుచేసినవే. ఇవి దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఆ సాంకేతికతలను పారిశ్రామిక రంగానికి, స్టార్టప్‌లకు బదిలీ చేస్తూ ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయడంలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది ఇస్రో. ఒకపక్క దేశ రక్షణ, అభివృద్ధికి ప్రయోగాలు చేస్తూనే ఈ సాంకేతికత బదిలీ ద్వారా భారీగా ఆదాయాన్నీ ఆర్జిస్తోంది.
ఇస్రో తన చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహన (ఎస్.ఎస్.ఎల్.వి.) సాంకేతిక పరిజ్ఞానాన్ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్.)కు రూ. 511 కోట్లకు బదిలీ చేసినట్లు ఇన్–స్పేస్ జూన్ నెలలో వెల్లడించింది. ఇస్రో తన లాంచ్ వెహికల్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఒక పరిశ్రమకు బదిలీ చేయటం ఇదే మొదటిసారి. చిన్న ఉపగ్రహాల తయారీ, ప్రపంచ అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువుగా మారటం వంటి లక్ష్యాలతో పురోగమిస్తున్న భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఈ సాంకేతికతల బదిలీ వ్యూహాత్మకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటికే హెచ్.ఎ.ఎల్., ఎల్ అండ్ టీ సంస్థలు ఇస్రోతో కలిసి పి.ఎస్.ఎల్.వి. (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)ల తయారీలో సాంకేతిక భాగస్వాములు అయ్యాయి.
సాంకేతికత బదిలీ
అంతరిక్ష ప్రయోగ వాహనాల సాంకేతికతల్ని బదిలీ చేయటానికి చాలాకాలం ముందు నుంచే ఇస్రో పౌర సేవల వినియోగం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తోంది. 1970, 80లలోనే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్‌లు వైద్య రంగానికి తమ పరిజ్ఞానాన్ని ఇచ్చాయి. ఇస్రో మొదటి పౌర సంబంధ పరిజ్ఞాన బదిలీ ‘పాలియురేథేన్ ఫోమ్ టెక్నాలజీ’. రాకెట్ మోటార్లలో ఉపయోగించే ఈ సాంకేతికతను కృత్రిమ అవయవాల తయారీకి అందించింది. ‘జైపూర్ ఫుట్’ను అభివృద్ధి చేయటానికి ఈ పరిజ్ఞానమే తోడ్పడింది. ఇస్రో డేటా ప్రకారం.. 2020 ముందు వరకు 400కు పైగా సాంకేతికతలను దాదాపు 235 పరిశ్రమలకు బదిలీ చేసింది. టెలికంకు కూడా ఇస్రో యాంటెన్నాలకు, గ్రౌండ్ స్టేషన్‌లను సాంకేతిక పరిజ్ఞానం అందించింది. ఎక్స్ కిరణాలు మరింత ప్రభావవంతంగా ప్రసరించేలా చేసే బెరిలియం ఎక్స్‌రే ట్యూబులు, ఆహార పర్యవేక్షణ డేటా సేకరణ వ్యవస్థలు, సిలికా థర్మల్ కవచాల వంటి ఎన్నో సాంకేతికతలను ఇస్రో బదిలీ చేసింది.
ఇన్–స్పేస్‌తో కొత్త యుగం
ఇన్–స్పేస్ ప్రారంభం, ఆ తర్వాత మారిన భారతీయ అంతరిక్ష విధానం.. సాంకేతిక బదిలీలకు ఊపునిచ్చాయి. అంతరిక్ష రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించి, తత్సంబంధ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్రం 2020లో ఏర్పాటుచేసిందే ‘ఇన్ స్పేస్’. ఇది ఇప్పటివరకు 90కిపైగా సాంకేతికతల బదిలీలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 6 అంతరిక్ష సంబంధ స్టార్టప్‌లకు ఇన్ స్పేస్ గ్రాంట్లు కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 330 పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఇన్ స్పేస్‌తో కలిసి పనిచేస్తున్నాయి.
విదేశాలపై ఆధారపడటం తగ్గింది
ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికతల తాజా బదిలీల్లో ముఖ్యమైనవి – జూలై 3న భారతీయ పరిశ్రమలకు అందిన 10 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు. ఇందులో కొన్ని ప్రధానమైనవి.. మంటల నుంచి రక్షించే సెరామిక్ ఆధారిత పూత, లేజర్ గైరోస్కోప్‌లు, సిరామిక్ సర్వో యాక్సిలెరోమీటర్లు, గ్రౌండ్ స్టేషన్ కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతికతలు. ఉపగ్రహ ప్రయోగాలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలు, జియోస్పేషియల్ అప్లికేషన్ ల వంటి కీలక రంగాలలో విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కూడా దేశీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ఇస్రో ప్రాధాన్యం ఇస్తోంది. 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల విలువైన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవటంపై దృష్టి సారించింది.
స్టార్టప్‌లకూ మార్గనిర్దేశనం
చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్, హైదరాబాద్‌లోని స్కైరూట్ వంటి అంతరిక్ష సంబంధిత స్టార్టప్‌లు.. రాకెట్ల నిర్మాణంలో పనిచేస్తున్నాయి. అవి వాటి లాంచ్ ప్యాడ్లు శ్రీహరికోటలో నిర్మించుకోవడానికి ఇస్రో అనుమతిచ్చింది. అంతేకాకుండా ఆ స్టార్టప్‌లకు అవసరమైన మార్గనిర్దేశనం కూడా ఇస్రో చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.కు సాంకేతికత బదిలీ, అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఏరోస్పేస్ వంటి వాటితో భాగస్వామ్యం.. ఇలాంటి చర్యలతో భారతీయ అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధి వేగం పుంజుకుంటోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా అంటున్నారు.
న్యూ స్పేస్ ఇండియా
ఇస్రో, మన అంతరిక్ష విభాగం.. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి. ఎన్నో సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంటాయి. ఆ ఫలాలను దేశంలోని పారిశ్రామిక రంగానికి అందజేసి.. అవి సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలి, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి జరగాలన్నదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) లక్ష్యం. ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని 2019లో ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దీని ఆదాయార్జన..
150కిపైగా ఒప్పందాలు
ఈ మార్చిలో కేంద్రం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వేతర సంస్థలకు సాంకేతిక బదిలీకి ఇన్ స్పేస్ 75 ఒప్పందాలు చేసుకుంది. అలాగే ఎన్‌ఎస్‌ఐఎల్.. ఇస్రో సాంకేతికతలను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు 78 ఒప్పందాలు కుదుర్చుకుంది.