
నెలకు రూ.14 వేల కోట్లు.. రోజుకు రూ.449 కోట్లు.. గంటకు రూ.18 కోట్లు
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అప్పు చేయలేదు
సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా పూర్తిగా అమలుకాలేదు
పైగా రాజధాని కోసం ప్రత్యేకంగా రూ.31 వేల కోట్ల అప్పులు
ఈ డబ్బులన్నీ దేనికోసం ఖర్చు చేశారో చెప్పాలి
శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ సభ్యులు
అప్పులు తప్పవన్న ఆర్థిక శాఖ మంత్రి కేశవ్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనంతగా... అతి తక్కువ సమయంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంగళవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కుంబా రవిబాబు మాట్లాడుతూ 15 నెలల కూటమి పాలనలో రూ.2,09,985 కోట్లు అప్పు చేశారని తెలిపారు. అంటే నెలకు రూ.13,939 కోట్లు, రోజుకు రూ.449 కోట్లు, గంటకు రూ18.73 కోట్లు చొప్పున అప్పు చేశారని పేర్కొన్నారు.
‘‘ఎన్నికల సందర్భంలో చంద్రబాబు, కూటమి నాయకులు తమను గెలిపిస్తే సంపద సృష్టించి వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఊరూవాడ తిరిగి ప్రచారం చేశారు. కానీ, ఆ తర్వాత సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదు.
పైగా సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ పండుగలు, వేడుకలు చేసుకోవడం విడ్డూరం. 15 నెలల పాలనలో బడ్జెట్ పరిధిలో రూ.1,33,202 కోట్లు, బడ్జెటేతరంగా రూ.44,383 కోట్లు, రాజధాని పేరిట రూ.31 వేల కోట్లు అప్పు చేశారు. మేం సూటిగా అడుగుతున్నాం... ఈ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది...? వాటికి వడ్డీ ఎంత? మెచ్యూరిటీ పిరియడ్ ఏమిటి? ఈ డబ్బులను ఏ స్కీమ్ కింద ఎంత ఖర్చు చేశారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
» ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ శ్లాబుల కుదింపుతో తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేయాలని ఆరు రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని, అలాంటి ఆలోచన ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అనే సంగతి చెప్పాలని కోరారు.
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకే అప్పులు : ఆర్థిక మంత్రి కేశవ్
‘‘ఏ వ్యవస్థనైనా రాత్రికి రాత్రే సరిదిద్దలేం. అప్పులు చేయక తప్పడం లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకే అప్పులు చేస్తున్నాం’ అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులను రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ కోసమే ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 2025–26లో రూ.79,226 కోట్ల అప్పులు చేయాలని ప్రతిపాదించగా రూ.35,305 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు చేయలేదని, కావాలంటే చర్చకు సిద్ధం అని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి రూ.8 వేల కోట్ల ఆదాయం తగ్గుతోందన్నారు.
అప్పుపై అసెంబ్లీనితప్పుదోవ పట్టిస్తారా?
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అసెంబ్లీని టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 వరకు తీసుకున్న రుణాలపై అసెంబ్లీలో సోమవారం అడిగిన ప్రశ్నకు కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో తేల్చిన లెక్కకు.. ప్రభుత్వం చెప్పిన లెక్కకు ఏమాత్రం పొంతన లేదని ఎత్తిచూపారు. అప్పులపై కూటమి సర్కారు వాస్తవాలను వక్రీకరించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
కాగ్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచి్చన ఆదాయం రూ.61,609.50 కోట్లు. అదే కాలంలో ప్రభుత్వం చేసిన వ్యయం రూ.1,16,626.53 కోట్లు అని వివరించారు. ఈ ఆగస్టు 31 వరకు రూ.55,901.43 కోట్లు అప్పులు చేసిందని కాగ్ తేల్చిందన్నారు. కానీ, కేవలం రూ.35,305.81 కోట్లు అప్పులు చేశామని చెప్పి సభను ప్రభుత్వం తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదా? రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? అంటూ బుగ్గన నిలదీశారు.