ఆయ‘కట్టు కథలు’

State government fails to save the benefits of farmers - Sakshi

రైతుల ప్రయోజనాలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా విడుదల చేయని దుస్థితి

కేవలం 21.17 లక్షల ఎకరాలకే నీరు విడుదల

రాయలసీమ, సాగర్‌ కుడి, ఎడమ కాలువల రైతుల నోట్లో మట్టి

మరోవైపు 2 కోట్ల ఎకరాలకు నీళ్లిస్తామంటూ సీఎం చంద్రబాబు బీరాలు  

సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నా.. గోదావరి పరవళ్లు తొక్కుతున్నా.. వంశధార, నాగావళి పోటీ పడి ప్రవహిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవుతోంది. ప్రాజెక్టుల్లో కావాల్సినన్ని నీళ్లున్నా కూడా నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువలతో పాటు రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క ఆయకట్టుకు విడుదల చేయకుండా ప్రభుత్వం కట్టుకథలు చెబుతోంది. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో 42.78 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఇందులో 16.26 లక్షల హెక్టార్లలో వరి వేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 21.34 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో 8.54 లక్షల హెక్టార్లలోనే వరి వేశారు. అదికూడా.. కరువనేదే ఎరుగని గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు వంశధార ప్రాజెక్టు కిందనున్న ఆయకట్టుకు మాత్రమే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. మిగిలిన ఆయకట్టులను గాలికొదిలేసింది.

రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో వరుసగా ఐదో ఏడాది కూడా విఫలమైన సీఎం చంద్రబాబు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 కోట్ల ఎకరాలకు నీళ్లందిస్తామంటూ ప్రకటన చేయడంతో అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 92,19,918 ఎకరాల ఆయకట్టు ఉంది. గత నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా కనీసం 25 శాతం ఆయకట్టుకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 16.26 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 8.54 లక్షల హెక్టార్ల(21.17 లక్షల ఎకరాలు)లోనే వరి పంట వేశారు. ఇందులో కనీసం 2 లక్షల ఎకరాలను బోరు బావుల కింద సాగు చేసి ఉంటారని అంచనా. అంటే.. వరికి సంబంధించి కేవలం 19.17 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం నీళ్లందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పట్టించుకోని సర్కార్‌..
ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. జూలై నెలాఖరుకే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. సాధారణంగా ఆగస్టు రెండో వారానికి శ్రీశైలాన్ని చేరాల్సిన కృష్ణమ్మ నెల ముందే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు అవసరాల కోసం 30 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డును తెలంగాణ సర్కార్‌ కోరితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం 25 టీఎంసీలు మాత్రమే చాలని పేర్కొంది. దీంతో బోర్డు ఆ మేరకు కేటాయింపులు చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడేలోగా జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా జూలై 19 నుంచి రోజుకు సగటున 5,940 క్యూసెక్కుల నీటిని తెలంగాణ సర్కార్‌ తరలిస్తూ అక్కడి ఆయకట్టుకు నీళ్లందిస్తోంది.

శ్రీశైలం జలాశయం ద్వారా జూలై 24 నుంచి రోజుకు సగటున 2,100 క్యూసెక్కులను కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. కానీ టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీళ్లందించాలి. ఆగస్టు మొదటి వారానికే హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి. నాగార్జునసాగర్‌లో నిల్వ కనీస నీటిమట్టాన్ని తాకిన వెంటనే సాగర్‌ కుడి, ఎడమ కాలువలకు నీరందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఐదారు రోజుల పాటు అరకొరగా నీరు విడుదల చేసి చేతులు దులుపుకుంది. తెలుగు గంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. తుంగభద్రలో ఈ ఏడాది నీటి లభ్యత పెరిగినా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు మాత్రం నీరు అందలేదు. సాగర్‌ కుడి, ఎడమ కాలువల కిందనున్న 14.68 లక్షల ఎకరాలదీ అదే పరిస్థితి. 

దీన్నేమంటారు బాబూ?
అటు తుంగభద్రకు ఇటు శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీళ్లందించడానికి అనుకూలమైన పరిస్థితులున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాయలసీమ, నెల్లూరు.. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువ కిందనున్న ఆయకట్టు రైతులు రోడ్లెక్కారు. సర్కార్‌ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. రైతుల ఆందోళనలు మిన్నంటడంతో సీఎం చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘కట్టు’కథలు వల్లెవేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను ఆయకట్టులకు అందించి పంటలు కాపాడకుండా.. 2 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు నివ్వెరపోయారు.  

రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు 92,19,918 ఎకరాలు 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు లక్ష్యం 16.26 లక్షల హెక్టార్లు
ఇప్పటివరకు 8.54 లక్షల హెక్టార్లు (21.17 లక్షల ఎకరాలు)లోనే పంట
బోరు బావుల కింద సాగు 2 లక్షల ఎకరాలు
కేవలం 19.17 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా నీరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top