ఎస్పీకి డీజీపీ గౌతం సవాంగ్‌ అభినందనలు

State DGP Congratulated Prakasam SP Siddhartha Kaushal - Sakshi

స్కాచ్‌ అవార్డు ఎంపిక కోసం జియోకు తొలిసారిగా వచ్చిన అత్యధిక ఓట్లు 

రెండో స్థానంలో చిత్తూరు ప్రాజెక్టు

సాక్షి, ఒంగోలు: ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రత్యేక లేఖ ద్వారా అభినందించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రాజెక్టులకు స్కాచ్‌ సంస్థ అవార్డులు ప్రకటిస్తుంది. దేశ వ్యాప్తంగా వెయ్యికిపైగా నామినేషన్స్‌ ఈ సంస్థ దృష్టికి వెళ్లాయి. ఈ సంస్థలో కేంద్ర మంత్రులు, ఆర్థిక నిపుణులు, మల్టీ మిలియనీర్లు, తదితరులు జ్యూరీ సభ్యులుగా 150 మంది ఉంటారు. వెయ్యి నామినేషన్లను పరిశీలించి వాటిలో ఉత్తమమైనవిగా 150 ఎంపిక చేశారు. వాటికి ట్విట్టర్‌ ద్వారా ఓటింగ్‌కు ఆహా్వనించగా స్కాచ్‌ అవార్డు చరిత్రలోనే ప్రకాశం ఎస్పీ ఆధ్వర్యంలో రూపొందిన జియో ప్రాజెక్టుకు తొలిసారిగా 5534 ఓట్లు లభించాయి. రెండో స్థానంలో కూడా మన రాష్ట్రానికే చెందిన ఉమన్‌ జువైనల్‌ వింగ్‌కు 2267 ఓట్లు వచ్చాయి.

వీటితో పాటు డీజీపీ కార్యాలయం నుంచి ప్రతిపాదించిన పోలీసింగ్‌ వింగ్‌ వీక్లీ ఆఫ్‌కు 1467 ఓట్లు లభించాయి. ఈ స్కాచ్‌ అవార్డుకు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నుంచి జియో ప్రాజెక్టు, చిత్తూరు జిల్లా నుంచి ఉమన్‌ జువైనల్‌ వింగ్, అనంతపురం నుంచి ఫేస్‌ ట్రాకర్, విశాఖ సిటీ నుంచి ఇంటిగ్రేటెడ్‌ సరై్వవలెన్స్‌ పెట్రోలింగ్‌ రెస్పాన్స్‌(ఐ–స్పార్క్‌), విశాఖ రూరల్‌ పాడేరు సబ్‌ డివిజన్‌ నుంచి స్ఫూర్తి, శ్రీకాకుళం జిల్లా నుంచి పోలీస్‌ ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌లు ఎంపికయ్యాయి. ఇప్పటికే ఈ అవార్డుకు సంబంధించి ప్రకాశం జిల్లా నుంచి పొదిలి సీఐ వి.శ్రీరాం, చీరాల ఒన్‌టౌన్‌ సీఐ నాగమల్లేశ్వరరావు, ఐటీ కోర్‌టీం నిపుణుడు సాయి తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం వీరు ఈ అవార్డును అందుకోనున్నారు.

స్కాచ్‌ అవార్డు చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక ఓట్లు దక్కించుకున్న ప్రకాశం జిల్లా జియో ప్రాజెక్టు రూపకర్త సిద్ధార్థ కౌశల్‌కు స్కాచ్‌ అవార్డు బహూకరించే సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ఎడిటర్‌ గురుశరన్‌ దంజాల్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జియో ప్రాజెక్టు దేశంలోనే అత్యధిక ఓట్లు దక్కించుకున్నందుకు జిల్లాలోని జియోలు, సీనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు ఎస్పీకి అభినందనలు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top