
మూతపడిన మదనపల్లె నక్కలదిన్నె ఉర్దూ పాఠశాల
మదనపల్లె సిటీ: రాష్ట్రంలో ద్వితీయ అధికార భాష అయన ఉర్దూ నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలో అనేక ఉర్దూ పాఠశాలలు సింగిల్ టీచర్లతో మరికొన్ని పాఠశాలలు అసలు టీచర్లే లేకనే పని చేస్తున్నాయి. ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని అనేకమంది నిరుద్యోగ ఉర్దూ ఉపాధ్యాయులు చంద్రబాబు నాయు డి పాదయాత్ర సమయంలో కోరారు. దీనిపై అప్పట్లో స్పందించి ఆయన టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిసింది .. ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది. కానీ ఇంత వరకు ప్రత్యేక డీఎస్సీ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా టీచర్లు లేక అనేక ఉర్దూ పాఠశాలలు మూతపడగా, ఆయా పాఠశాలల్లోని ఉర్దూ విద్యార్థులు డ్రాప్‌ఔట్‌లుగా మారుతున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ముస్లిం మైనార్టీల కోసం 200 గురుకుల పాఠశాలలు మంజూరు చేయగా రాష్ట్రంలో ఒక్క ఉర్దూ పాఠశాల కూడా కొత్తగా మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సింది ప్రత్యేక పాఠశాలలు, అందులో గుణాత్మక విద్క అందించేందుకు టీచర్లు కానీ.. ఏడాదికోసారి రంజాన్ మాసంలో ఇఫ్తార్, రంజాన్ తోఫాలు ఇవ్వడం కాదని ముస్లిం మైనారి టీలు విమర్శిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 205 ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి. 27 ఉన్నత పాఠశాలలు, 38 ప్రాథమికోన్నత ,140 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో అనే క పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు ఉండగా, మరి కొన్ని పాఠశాలల్లో అసలు టీచర్లే లేరు. ముఖ్యం గా ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఉర్దూ పాఠశాలల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ నియోజకవర్గంలోనే అనేక ఉర్దూ పాఠశాలల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కుప్పం మండలంలోని రాగిమానుమిట్ట ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో 8 తరగతుల్లో వంద మంది ఉర్దూ విద్యార్థులు ఉండగా ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. అలా గే ఇదే మండలంలో కంగుంది పాఠశాల టీచర్లు లేక మూతపడ్డాయి. నగిరి మండలం వేలవాడి ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క టీచరు కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎర్రావారిపాళెం మండలంలో ఉర్దూ పాఠశాలలు టీచర్లు లేక ఇప్పటికే మూతపడ్డాయి. అయినా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.
భర్తీకి నోచుకోని ఉర్దూ పోస్టులు
ఉపాధ్యాయ నియామకాల్లో రోస్టర్ ప్రకారం దాదాపు 40 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, డీ రిజ్వర్డ్ కేటగిరిలకు కేటాయించడంతో ఆయా విభాగాల్లో ఉర్దూ అర్హత కలిగిన అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గతంలో ఇలాంటి కేటగిరి లలో డి రిజర్వుడ్ ద్వారా ఉర్దూ పోస్టులను భర్తీ చేసి టీచర్ల కొరతను తీర్చేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వారు వాపోతున్నారు.