లోకేశ్‌ బాటలో చంద్రబాబు! | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ బాటలో చంద్రబాబు!

Published Thu, Sep 21 2017 3:43 PM

లోకేశ్‌ బాటలో చంద్రబాబు! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు తన పుత్రుడు, మంత్రి లోకేశ్‌ బాటలో పయనిస్తున్నట్టు కనబడుతోంది. తడబడటంలో తన కుమారుడికి పోటీ వస్తున్నారు. బహిరంగ వేదికలపైనా, పార్టీ సమావేశాల్లో పొరపాటుగా మాట్లాడటం ‘చినబాబు’కు అలవాటుగా మారింది. తాజాగా చంద్రబాబు కూడా తప్పులో కాలేశారు. సాక్షాత్తూ తన అధికారిక ట్విటర్‌ పేజీలో అచ్చు తప్పు పెట్టి విమర్శలపాలయ్యారు.

ఆపదలో ఉన్న మహిళలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం గురువారం 181 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘ఆపదలో ఉన్న మహిళలను ఆడుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. గృహహింస, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్యలకు పరిష్కారమవుతాయ’ని ట్వీట్‌ చేశారు. మహిళలను ఆదుకోవడం అనడానికి బదులు ఆడుకోవడం అని పేర్కొన్నారు.


బాబుగారి నిర్వాకంపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్విటర్‌లో ఇంత పెద్దతప్పు దొర్లడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. పొరపాటుగా పోస్ట్‌ పెట్టినా వాస్తవంలో టీడీపీ సర్కారు ఇలాగే వ్యవహరిస్తోందని, మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతోందని కామెంట్లు పెట్టారు. మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో పడతులపై ‘పచ్చ’ నాయకుల ఆగడాలను ప్రస్తావించారు. మహిళా అధికారి వనజాక్షిపై దాడి వ్యవహారాన్ని, అనంతపురం జిల్లాలో అభాగ్య మహిళపై అధికార నేతలు ప్రదర్శించిన దుర్మార్గాన్ని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అకృత్యాలను ఏకరువు పెట్టారు. ముందు తెలుగు తమ్ముళ్లను అదుపులో పెట్టాలని సీఎంకు సూచించారు. అచ్చు తప్పు పెద్ద విషయం కాదని, టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రచార ఆర్భాటాలు మానుకుని, పాలనపై దృష్టి పెట్టాలని చురకలు అంటించారు. నెటిజన్ల నుంచి విమర్శలు పోటెత్తడంతో ఈ ట్వీట్‌ను చంద్రబాబు తన అధికారిక ట్విటర్‌ పేజీ నుంచి తొలగించారు.

Advertisement
Advertisement