టమాటా లోడుతో వస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
టమాటా వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
డ్రైవర్ మృతి మరో ముగ్గురికి తీవ్రగాయాలు
కురబలకోట : టమాటా లోడుతో వస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం మండలంలో దాదంవారిపల్లె సమీపంలోని తూపల్లె క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ వేంకటేశ్వర్లు కథనం మేరకు...తంబళ్లపల్లె మండలం పల్లెకుంటపల్లెకు చెందిన పి.అశోక్ మంగళవారం పరిసర ప్రాంతాల్లోని రైతుల టమాటాలతో మదనపల్లె మార్కెట్‌కు బొలెరో వ్యాన్‌లో బయలుదేరాడు. మండలంలోని తూపల్లె క్రాస్ వద్ద ఎదురుగా తంబళ్లపల్లెకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో బొలెరో వ్యాన్ ముందరి భాగం ధ్వంసమైంది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్టీరింగ్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన అశోక్ మృతదేహాన్ని వెలికి తీయడానికి అవస్థలు పడ్డారు. జేసీబీ సాయంతో ఎట్టకేలకు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ రైతులు కుమార్‌రెడ్డి, సుబ్బయ్య, మల్లికార్జునరెడ్డిని 108లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశోక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో బస్సు డ్రైవర్ బ్రేక్ వేసిన దాఖలాలు కూడా లేవని చెబుతున్నారు. మితిమీరిన వేగం, ఆపై నిర్లక్ష్యం అశోక్ ప్రాణాల్ని బలిగొనడంతోపాటు పాటు మరో ముగ్గురు రైతులను ఆస్పత్రి పాల్జేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.