సంక్షేమ సంతకం చెరగని జ్ఞాపకం

special story on ys rajasekhara reddy 70th birth anniversary - Sakshi

ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నీ స్థానం పదిలం ఆరోగ్యశ్రీతో ఆయుష్షు నింపావు.. 108తో ఆపద్బాంధవుడవయ్యావు.. జలయజ్ఞంతో భగీరథుడవయ్యావు.. రైతుల కోసం వ్యవ‘సాయం’ చేశావు.. ఇళ్లు ఇచ్చి.. కన్నీళ్లు తుడిచావు.. పింఛన్లతో అవ్వాతాతలకు చేతి ఊతమయ్యావు.. పార్టీలతో పనేంటి?.. ప్రజలంతా నా వాళ్లే అన్నావు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరాగా నిలిచావు... ఇచ్చిన మాట కోసం మరణానికైనా ఎదురెళ్లావు.. రాజకీయ నాయకుడిగా కాదు.. రాముడిలా పాలించావు.. విశ్వసనీయతే నీ ఇంటి పేరుగా మార్చుకున్నావు..మీ విధానాలు నిత్య నూతనం...సదా అనుసరణీయం అందుకే పదేళ్లయినా..ఇంకో వందేళ్లయినా నిను మరువదు ఈ ప్రజ.

మనసున్నవాడు పాలకుడు అయితే పాలన ఎంత ప్రజారంజకంగా ఉంటుందో...గుండెలో తడి ఉన్న నేత పాలకుడు అయితే ప్రజల కళ్లల్లో తడి చేరకుండా ఎలా పాలిస్తాడో... ప్రజలను ఓటర్లుగా కాకుండా తనవాళ్లుగా చూసే నేత పాలకుడు అయితే ఎంతటి సంక్షేమం సాధ్యమో... అన్నదాన్ని దేశానికి చూపిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఎందుకంటే ఆయన అమ్మానాన్నల కష్టం తెలిసిన ఓ కొడుకు.. చదువు ‘కొనలేక’పోతున్న విద్యార్థుల మానసిక క్షోభను గుర్తించిన ఓ తండ్రి.. అవ్వాతాతల బాధలు చూసిన ఓ మనవడు.. రైతు రుణం తీర్చుకోవాలనుకునే ఓ రుషి.. పేదోడి గుండె చప్పుడు విన్న మనసున్న రాజు. అందుకే తరతమభేదం లేకుండా మనసుతో పాలించి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచగలిగారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేవలం రాజకీయ నేతగా పరిపాలించలేదు... ఓ సామాజికవేత్తగా, అర్థశాస్త్ర నిపుణుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, అన్నింటికీ మించి ప్రతి ఇంటి సభ్యుడిగా తనను తాను భావించి పరిపాలించారు. వైఎస్సార్‌ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందుకే సుభిక్షమైన పాలనకు నిర్వచనంగా అనాదికాలం నుంచి రామరాజ్యం అన్నది ఎంతగా స్థిరపడిపోయిందో.. మన రాష్ట్రంలో నేడు రాజన్న రాజ్యం అన్నది కూడా అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఆ మహానేత దివంగతుడై పదేళ్లు గడిచినప్పటికీ ఆయన పరిపాలన ప్రజల మనసుపొరల్లో సజీవంగా నిక్షిప్తమై ఉంది. ఇంకో వందేళ్లయినా ఆయన ఖ్యాతి నిలిచే ఉంటుంది.  
– సాక్షి, అమరావతి

అజరామరం ఆయన స్ఫూర్తి...
వైఎస్‌ రాజశేఖరరెడ్డి... ఆ పేరే ఓ స్ఫూర్తి. కఠిన కాల పరీక్షకు ఎదురొడ్డి ప్రజల మనసులో దేదీప్యమానంగా వెలుగొందుతున్న దీప్తి. ఎన్నో సిద్ధాంతాలు, పాలనా విధానాలు కాలక్రమంలో కనుమరుగైపోతూ ఉంటాయి. దీనికి వైఎస్సార్‌ పూర్తిగా మినహాయింపు. ఆయన పరిపాలనా విధానం, ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ, ఎన్నటికీ ఆదర్శనీయం. ఎందుకంటే ఆయన సమాజాన్ని మనసుతో చూసి పాలించారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, సామాజిక పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాలు అత్యంత ఆవశ్యకమైనవిగా సామాజికవేత్తలు గుర్తించారు. వైఎస్‌ హఠాన్మరణానంతరం ప్రభుత్వాలు ఆయన పథకాలను నీరుగార్చడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆ రాజన్న పాలన మళ్లీ రావాలని ప్రజల గుండెలు తపించాయి. అందుకే ‘ఆనాటి రామరాజ్యం నేను చూడలేదు.. కానీ రాజన్న రాజ్యం చూశాను. నాకు అవకాశం ఇస్తే మళ్లీ ఆనాటి రాజన్న రాజ్యం తీసుకువస్తాను’ అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటను ప్రజలు అంతగా నమ్మారు. తండ్రి పేరును నిలబెట్టే సిసలైన వారసుడిగా గుర్తించి ఆయనకు పట్టాభిషేకం చేశారు.

చదివించే బాధ్యత భుజానికెత్తుకున్నారు..
చదవాలనే తపన ఉండి.. కేవలం డబ్బులేక విద్యను మధ్యలోనే ముగించాల్సి రావడం ఆ విద్యార్థిని ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో వర్ణించడం సాధ్యం కాదు. తన బిడ్డను చదివించే స్తోమత లేక నిద్రలేని రాత్రులు గడిపి ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రులు ఎందరో. ఈ పరిస్థితులన్నిటినీ ఒకే ఒక్క పథకం శాశ్వతంగా మార్చేసింది. అదే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం. ఉన్నత విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని వైఎస్సార్‌ గుర్తించారు. పేద విద్యార్థులను చదివించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు పైసా ఖర్చులేకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఇతర కాలేజీల్లో చదువుకున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన పిల్లలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. మహానేత పాలన ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

 పేదరికం జబ్బును నయం చేసిన వైద్యుడు  
పేదరిక నిర్మూలనకు మందు విద్య, ఆరోగ్యమేనని సూత్రీకరించిన సామాజిక వైద్యుడు వైఎస్‌. అందుకే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను ప్రవేశపెట్టి సామాజిక విప్లవం తీసుకువచ్చారు. పేదలు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి వైద్య బీమా పొందేందుకు వైఎస్‌ ప్రవేశపెట్టిన ‘రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం’ ఓ సంచలనం. అంతవరకు ప్రీమియం చెల్లించకుండా వైద్య బీమా అందించే పథకం ఏదీ మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఎవరూ ఊహించని రీతిలో లక్షలాదిమంది పేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన హయాంలో ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారు.

అంతేకాదు 108, 104 వైద్యసేవలతో ఆయన మరో విప్లవం సృష్టించారు. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా, ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒక్క ఫోన్‌ చేస్తే కుయ్‌.. కుయ్‌.. అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చి ఆస్పత్రికి సకాలంలో తరలించడం అన్నది దేశంలో అదే మొదటిసారి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న వేలాది గ్రామాలకు 104 వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించేలా చేయడం వైఎస్సార్‌కే చెల్లింది. ఉచిత పథకాలకు పూర్తి వ్యతిరేకం అయిన ప్రపంచ బ్యాంక్‌ కూడా వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించడం విశేషం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆయన స్ఫూర్తి దేశంలో ఎన్నో రాష్ట్రాలకే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా మార్గనిర్దేశం చేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి నేటికీ అమలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌ ’ పథకం కూడా ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తితో రూపొందించినదే. ఆరోగ్య భారత్‌ సాధనకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ వైఎస్సారే మార్గనిర్దేశం చేశారు.

రాజకీయ సంస్కర్త..
ప్రజలను కేవలం ఓటర్లుగా చూసే గత పాలకుల విధానాలతో భ్రష్టుపట్టిన రాజకీయాలను సంస్కరించిన సంస్కర్త వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ప్రజలను సమ దృష్టితో చూడాలన్న విధానాలకు అంతకుముందు ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చేశాయి. తమ పార్టీకి ఓటేశారా?.. ఏ సామాజికవర్గానికి చెందినవారు? మన పార్టీ నేతల సిఫార్సు ఉందా లేదా? అన్నది చూసే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. చివరికి వృద్ధులు, వితంతువుల పింఛన్ల పంపిణీలో కూడా ఇదే నీచ రాజకీయాలు రాజ్యం చేశాయి. మహానేత వైఎస్సార్‌ తన పాదయాత్రలో ఈ దుస్థితిని చూసి చలించిపోయారు. ప్రజలందర్నీ తనవాళ్లగానే చూడాలన్నది ఆయన సిద్ధాంతం. ఆయన 2004 ఎన్నికల్లో సీఎం కాగానే రాజకీయాలకు అతీతంగా పాలన సాగించారు. శాచ్యురేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను అందించారు.

అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రయోజనం అందించిన ఘనత ఆయనదే. అందుకే 2009లోనూ ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. వైఎస్‌ స్ఫూర్తిని ఆయన తదనంతర ప్రభుత్వాలు కొనసాగించలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీల పేరుతో దుష్ట రాజకీయాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ నేతలు పచ్చ ముద్ర వేస్తేనే ప్రభుత్వ పథకాలు అన్న విధానం అమలైంది. దాంతో ప్రజలు వాస్తవాన్ని గుర్తించారు. ‘కులం చూడం.. మతం చూడం.. రాజకీయాలు చూడం.. పార్టీలు చూడం.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం’ అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్ట ప్రకటన పార్టీలకు అతీతంగా ప్రజల మనసును తాకింది. ఆ మహానేత స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వైఎస్‌ జగన్‌ పట్ల ప్రజలు అచంచల విశ్వాసం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీకి అద్వితీయమైన విజయాన్ని అందించి రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చారు.  

అపర భగీరథుడు..
ప్రపంచీకరణ అనంతర పరిణామాల్లో వ్యవసాయ రంగాన్ని విస్మరించి ఊహాకాశంలో పరుగులు తీస్తున్న పాలకులకు వైఎస్సార్‌ మట్టి వాసనను మళ్లీ పరిచయం చేశారు. ఆర్థిక సంస్కరణలుగానీ మరే విధానమైనాగానీ వ్యవసాయ రంగమే మూలాధారమని మార్గనిర్దేశం చేశారు. సాగు, నీటిపారుదల రంగాలకు పెద్దపీట వేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అంతకుముందు పాలకులు ‘సాధ్యం కాదు.. కూడదు’ అన్న ఉచిత విద్యుత్‌ను సాకారం చేసి చూపించారు. జలయజ్ఞం పేరుతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం బిగించారు. కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందించేందుకు 86 ప్రాజెక్టులను చేపట్టారు. బీడుబారిన పొలాలను సస్యశ్యామలం చేశారు. రైతులకు బ్యాంకుల నుంచి సకాలంలో నామమాత్రపు వడ్డీకే రుణాలు అందించేలా కృషి చేశారు.

మహానేత హఠాన్మరణానంతరం వచ్చిన ప్రభుత్వాల నిర్వాకంతో సాగు, నీటిపారుదల రంగాలకు మళ్లీ గ్రహణం పట్టింది. పంట రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా రైతులను నిండా ముంచారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడ్డారు. జలయజ్ఞం నిలిచిపోయింది. శాశ్వత ప్రయోజనాన్ని అందించే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం తమ అవినీతికి ఏటీఎంగా మార్చుకుంది. పట్టిసీమ వంటి తాత్కాలిక పథకాలతో ప్రజలను కనికట్టు చేసి కోట్లు దోచుకుంది. మరోవైపు సాగునీరు లేక పంటలు దెబ్బతిన్నాయి. రాయలసీమలో పొలాలు బీడువారాయి. రైతులు కూలీలుగా మారి వలస బాట పట్టారు. దాంతో రైతులు మరోసారి రాజన్న రాజ్యం కావాలని కోరుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాసటగా నిలిచి అఖండ విజయాన్ని అందించారు.

మహానేత కలను సాకారం చేస్తున్న జననేత
ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో పరితపించారు. తనదైన శైలిలో పేదల అభ్యున్నతికి ఒక అడుగు ముందుకు వేసి ఎన్నో వినూత్న పథకాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. అంతలోనే ఆయన మనకెవ్వరికీ అందనంత దూరంగా సుదూర తీరాలకు వెళ్లిపోయారు. ఆయనే కనుక ఉండి ఉంటే అందరి భవిష్యత్‌ బంగారంలా ఉండేదని అన్ని వర్గాల ప్రజలు అనునిత్యం గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ఆ స్వర్ణ యుగం ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమంటూ మొన్నటి ఎన్నికల్లో పట్టం కట్టారు. ఇది జరిగి నెల రోజులైనా పూర్తవ్వకముందే.. వైఎస్‌ జగన్‌ పేదల అభ్యున్నతికి రెండడుగులు ముందుకు వేస్తూ నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top