దొనకొండలో ప్రత్యేక సెజ్‌

Special SEZ in Donakonda - Sakshi

మడకశిరలో ఆటోమొబైల్‌ సెజ్‌

ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ, ఇతర పరిశ్రమల కోసం కొత్తగా 30 లక్షల చదరపు అడుగులు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బోర్డు మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌.కె. రోజా, ఏపీఐఐసీ ఎండీ రజత్‌ భార్గవ, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ, విమానయాన రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రజత్‌ భార్గవ వివరించారు. దొనకొండలో ఇప్పటికే బ్రిటీష్‌ కాలం నాటి విమానాశ్రయం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా మడకశిరలో ఆటో మొబైల్, దాని అనుబంధ పరికరాల తయారీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే చిన్న మధ్య తరహా కంపెనీలు నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్లగ్‌ అండ్‌ ప్లే కేంద్రాలను ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా హిందూపురం, విశాఖ జిల్లా అచ్యుతాపురం, నెల్లూరు జిల్లా నాయుడుపేట, చిత్తూరు జిల్లా ఈఎంఎసీ–2, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో మరిన్ని ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ బోర్డు తీర్మానించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top