Sakshi News home page

త్వరలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

Published Sat, Jul 26 2014 1:35 AM

soonly online registration services

 తాడేపల్లిగూడెం :  త్వరలో రిజిస్ట్రేషన్ల సేవలను ఆన్‌లైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దిశగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే కనుక అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన భూములు, లేదా కట్టడాలను ఎక్కడినుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు వివరాలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎం.సాయిప్రసాదరెడ్డి శుక్రవారం వెల్లడించారు.

భూముల విలువను నిర్ధారించే క్రమంలో భాగంగా పట్టణంలో పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో భూముల విలువలు పెరుగుతాయన్నారు. ఈ మేరకు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి విలువను నిర్ధారిస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల శాఖ ఆదాయం కేవలం 60 శాతం మాత్రమే వచ్చిందన్నారు. 2014-15లో పెరగనున్న భూముల విలువ కారణంగా జిల్లాలో రూ.375 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సర్టిఫికెట్ల కాపీలను ఎవ్వరికి వారే తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుందన్నారు. ఆయన వెంట సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ పి.శేఖర్ ఉన్నారు.

Advertisement
Advertisement