సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో రెండో రోజు జరిగిన కోడిపందాల్లో ఓ కోడి ఏకంగా కోటి 43 లక్షలు గెలిచింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో 1 కోటి 53 లక్షల పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ (సేతువ), రాజమండ్రి రమేష్ (డేగ) మధ్య భారీ పందెం నిర్వహించగా.. రాజమండ్రి రమేష్ డేగ విజేతగా నిలిచింది. రేపు మరో భారీ పందానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పందాల్లో పాల్గొనేందుకు పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు.
కాగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులపై పందెంరాయుళ్లే పైచేయి సాధించారు కోళ్లకు కత్తులు కట్టి పందేలకు తెరలేపారు. కూటమి ప్రజా ప్రతినిధులు దగ్గరుండి బరులను ప్రారంభించారు. పందేల మాటున పెద్ద ఎత్తున గుండాట, పేకాట, కోతాట, జూదాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజునే రూ.100 కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా.
కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రచారం హోరెత్తించిన పోలీసు యంత్రాంగం పత్తా లేకుండా పోయింది. మైకులు మూగబోయాయి. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కడ చూసిన కోడిపందేల జోరే కనిపిస్తోంది. కూటమి నేతల ఆధ్వర్యంలో వందకు పైనే బరులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పందేలు, గుండాట, పేకాటను మొదలుపెట్టేశారు. డేగాపురం, నరసాపురం, పెదఅమిరంలో క్యాసినోలు ఏర్పాటుచేసి భారీ మొత్తంలో జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఎక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే క్యాసినోలోకి వెళ్తున్నట్లు సమాచారం. భీమవరం, ఉండి, దెందులూరు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. పందెం కోసం పుంజులు తెచ్చినవారికి, డబ్బులు కాసేవారికి, చూసేందుకు వచ్చేవారికి వేర్వేరు చేతి బ్యాండ్లు ఇచ్చి గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం స్టాళ్లు ఏర్పాటచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. పట్టణ శివార్లలోని పలు గెస్ట్‌హౌస్‌లు, ప్లాట్లు పేకాట శిబిరాలతో జూద కేంద్రాలుగా మారిపోయాయి.


