కొత్త ఆలోచనలతోనే బీసీల పురోగతి
ఏలూరు (టూటౌన్) : బీసీల్లో కొత్త ఆలోచనలు, చర్చ ప్రారంభం కావాలని అప్పుడే వారు పురోగతి సాధించగలుగుతారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ అన్నారు. ఏలూరు రామకృష్ణాపురంలోని సాహిత్య మండలి హాలులో ఆదివారం నిర్వహించిన బీసీ మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన సదస్సులో విజయ్‌కుమార్ మాట్లాడుతూ బీసీల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కొన్ని సామాజిక వర్గాల వారే 80 శా తం అధికారం చెలాయించారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని, స్వయం ఉపాధి పథకాలకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని, ఆదరణ పథకంలో పరికరాల కొనుగోలుకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వారు అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలో వీటి కోసం ఎంత కేటాయించారని నిలదీశారు. బీసీల రక్షణ చట్టం తెస్తామని మోసం చేశారన్నారు.
రాజ్యాధికారం దిశగా ఎదగాలి
ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, రిటైర్డ్ డీజీపీ జె.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 52 శాతం వర్గీకరణ చేయాలన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీలు ఉంటే కేవలం 40 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. బీసీ ఐక్య సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వీజీఆర్ నారగోని మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా బీసీలు ఎదగాలన్నారు. రాజకీయ ఉద్యమం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లంకా వెంకటేశ్వరరావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్‌పీఆర్ విఠల్‌కుమార్, బీసీ నాయకులు ముదుగురు సూర్యనారాయణ, ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మెండెం సంతోష్‌కుమార్, బీసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు బొద్దూరి హరిప్రసాదరావు, బీసీ ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి ఇళ్ల వరప్రసాద్, బీసీ నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, రిటైర్డ్ తహసీల్దార్ గుబ్బల నాగేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బీసీ మేధోమథన సదస్సులో వక్తలు


