టీడీపీలో రాజకీయ డ్రామా!

Somireddy to resign for MLC to contest as MLA - Sakshi

మంత్రి సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు ఎమ్మెల్సీ హామీ

ఎన్నికల ముందే ఇస్తామన్న చంద్రబాబు

మరో 20 రోజుల్లో నారాయణ పదవీ కాలం ముగింపు

ఎమ్మెల్సీ రేసులోకి మరికొందరు అసమ్మతి నేతలు

అసమ్మతి నేత పెళ్లకూరు తిరుగుబాటు

జొన్నవాడలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా రాజకీయ మంత్రాంగం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  అధికార పార్టీలో ఎన్నికల హీట్‌ నెల్లూరును పూర్తిస్థాయిలో తాకింది. సీట్ల సర్దుబాట్లు, అసంతృప్తులకు బుజ్జగింపులు, అలకలు హడావుడి తారస్థాయికి చేరింది. పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు శుక్రవారం రాజకీయ డ్రామాకు తెర తీశారు. నగర మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ను ఎమ్మెల్సీ హామీతో టికెట్‌ రేస్‌ నుంచి చక్కగా తప్పించారు. సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధమవుతున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో మంత్రి నారాయణ పదవీ కాలం కూడా కొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఆయన కూడా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఖరారు కావడంతో ఈ రెండు ఎమ్మెల్సీ పదవులను ఒకటి అజీజ్, మరొకటి ఇంకో నేతకు ఇచ్చి అసంతృప్తులను శాంతింప చేసే అవకాశం ఉందనే ప్రచార బలంగా సాగుతోంది. మరో తిరుగుబాటు నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీ నేతలతో నిమిత్తం లేకుండా కోవూరు 

నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్వం మొదలు పెట్టారు. మొత్తం మీద టీడీపీలో జిల్లా రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది. రెండు రోజులుగా అధికార పార్టీలో కీలకంగా సాగుతున్న పరిణామాలు శుక్రవారం ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి నేతల్ని బుజ్జగించటమే లక్ష్యంగా పదవుల ఎర వేస్తున్నారు. రెండు రోజుల క్రితం కొందరు నేతలకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారు. కొందరు ద్వితీయశ్రేణి నేతలు తమ సంగతి ఏంటని పార్టీ ముఖ్యుల్ని నిలదీశారు. దీని కొనసాగింపులో భాగంగా శుక్రవారం అమరావతిలో నెల్లూరు రాజకీయ మంత్రాంగం బలంగా నడిచింది. మరో వైపు పదవీ కాలం రెండేళ్లు ఉన్న సర్వేపల్లి టికెట్‌కు పదవీ గండంగా మారుతుందనే యోచనతో మంత్రి సోమిరెడ్డి రాజీనామా చేశారు. అయితే జిల్లాలో మరి కొందరికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున సీఎం రాజీనామా చేయించారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజీనామా చేసిన తర్వాత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పదవి వేరే నేతలకు ఉపయోగపడితే మంచిది కదా అని వ్యాఖ్యానించటం గమనార్హం.  

మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ
నగర మేయర్‌గా ఉన్న అబ్దుల్‌ అజీజ్‌ నగర ఎమ్మెల్యే టికెట్‌ హామీతో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ అయి మేయర్‌గా కొనసాగుతున్నారు.  నగర టికెట్‌ మంత్రి నారాయణకు, రూరల్‌ టికెట్‌ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కేటాయించిన క్రమంలో నగర మేయర్‌ అనుచరగణం, మైనార్టీ నేతలు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎంను కలవాల్సిందిగా నగర మేయర్‌కు పిలుపు వచ్చింది. సీఎంను కలిసినప్పుడు ఎన్నికల ముందే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి అనుగణంగా మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, మరో 20 రోజుల్లో మంత్రి నారాయణ పదవీ కాలం ముగియడంతో అజీజ్‌కు దక్కే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీగా అవకాశం రాగానే అజీజ్‌ నగర మేయర్‌ పదవికి రాజీనామా చేయాలి.  మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది.  

ప్రచార పర్వంలో అసమ్మతి నేత 
మరో వైపు శుక్రవారం కోవూరు టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశ నిర్వహించి కోవూరు నుంచి పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇక్కడ టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి తనకు మధ్య పార్టీ నేతలు చేసిన ఒప్పందం ప్రకారం అవకాశం ఇవ్వాలని రాని పక్షంలో అయినా తాను పోటీలో నిలుస్తానని ప్రకటించుకున్నారు. దీని కొనసాగింపుగా జొన్నవాడలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో కోవూరు టీడీపీలో రాజకీయ గందరగోళం రేగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top