గుక్కెడు నీటి కోసం... బండెడు కష్టాలు

Solve Drinking Water Problem In Kadapa - Sakshi

చింతకొమ్మదిన్నె : మండలంలోని జె.నారాయణపురం, బయనపల్లి గ్రామాల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు.   ఏళ్లు గడుస్తున్నా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి నీటి కోసం గ్రామంలోని బోరు వద్ద మిందెలతో బారులు తీరుతున్నారు. అనేక సార్లు నీటికోసం అధికారులను, పాలకులను కలసి సమస్యను వివరించినా పరిష్కారం లభించక పోవడంతో చేసేదేమి లేక ప్రజలు వారి తిప్పలు వారు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరులో నీరు ఇంకి పోవడంతో వస్తున్న అరకొర నీటితోనే గొంతులు తడుపుకుంటున్నారు. గ్రామంలో ఒక్క ఇంటికి కూడా కుళాయిల ద్వారా నీరు అందే పరిస్థితి కనిపించడంలేదు.

మంచి నీటి కోసం ఇంటి దగ్గర ఎవరో ఇకరు కాపలా ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. బయనపల్లి, బుగ్గలేటిపల్లి గ్రామాల్లో తాగేందుకు నీరు పుష్కలంగా ఉన్నప్పటికి అవి గొంతు వరకు చేరడంలేదు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మంచి నీటి పైపులైన్‌ను తొలగించి అలాగే వదిలేయడంతో నీటి కోసం పక్క ఊర్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ రెండు గ్రామాల ప్రజలు ఆర్‌అండ్‌బీ, కార్పొరేషన్‌ అధికారులను కలసి సమస్యను వివరించినా పట్టించుకన్న పాపానపోటేదు. దీంతో ట్యాంకర్ల వద్దకు, పంటపొలాల వైపుకు నీటి కోసం వెళుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తగిన చర్యలు తీసుకుని మంచి నీటి సమస్యను పరిస్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ముసలి మొప్పున తిప్పలు పడుతున్నాం
ముసలిమొప్పున తాగేందుకు నీళ్లు లేక దూరం నుంచి తెచ్చుకునే శక్తి లేక ఇబ్బందులు పడుతున్నాం. మూడేళ్ల నుంచి మా ఊర్లో నీళ్ల కోసం తిప్పలు పడుతున్నాం. ఉన్న ఒక్క బోరులో నీరు అడుగంటడంతో ఈ అగచాట్లు వచ్చాయి. మా ఊరికి మరో బోరును ఏర్పాటు చేయాలని అధికారులను, పాలకులను అడిగినా ఫలితం లేదు.
సరస్వతి, జె.నారాయణపురం

ఎన్నాళ్లో ఈ తిప్పలు
రోడ్డు నిర్మాణ పనుల కోసమని ఉన్న పైపులైన్‌ను తొలగించారు. తాగేందుకు పష్కలంగా ఉన్నా అవి గొంతును తడపడం లేదు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు, పాలకులకు సమస్యను వివరించినా వారు పట్టించుకోకపోవడంతో ఈ తిప్పలు పడుతున్నాం. రోడ్డు నిర్మాణ పనులు పూర్తై నెలలు గడుస్తున్నా పైపులైన్‌ ఏర్పాటు చేయలేదు.
మల్లీశ్వర్‌రెడ్డి, బయనపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top