పుర్రె పగిలిపోతోంది!

Skull Breaking Challenge Spreads On TikTok - Sakshi

బాబోయ్‌...స్కల్‌ బ్రేకింగ్‌ ఛాలెంజ్‌

సోషల్‌ మీడియాలో వీడియోల హల్‌చల్‌

పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్న ఆట.. హడలిపోతున్న తల్లిదండ్రులు

తక్షణం ఆ వీడియోలను తొలగించాలని కేంద్రం ఆదేశం

సాక్షి, అమరావతి: ముగ్గురు పిల్లలు ఒకరి పక్కన మరొకరు వరుసగా నిలుచున్నారు. ఓ నిమిషం వారిలో వారే చర్చించుకున్న తర్వాత ఒక్కసారే ముగ్గురూ కొద్దిగా పైకి గాల్లోకి ఎగరడం ప్రారంభించారు. అదేదో సరదాగా ఆడుకునే ఆట అనుకుంటే.. ఇలా రెండుసార్లు ఎగిరిన తర్వాత మధ్యలో ఉన్నవాడు మూడోసారి ఎగరగానే.. ఆ చివర ఈ చివర ఉన్న పిల్లలు వాని రెండు కాళ్లను తమ కాళ్లతో గట్టిగా ముందుకు నెట్టేశారు. ఆ పిల్లాడు ఒక్కసారిగా వెనక్కి దభీమని పడిపోయాడు. తల వెనుక భాగం బలంగా నేలను తాకింది. అంతే ఆ పిల్లాడు ఇక పైకి లేవలేదు. తల పగిలి రక్తం ధారలు కట్టింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో. ఒకటి కాదు, రెండు కాదు.. ఈ తరహా వీడియోలు అనేకం టిక్‌ టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. ‘స్కల్‌ బ్రేకింగ్‌ ఛాలెంజ్‌’ పేరిట వైరల్‌ అవుతూ పిల్లలకు ప్రాణసంకటంగా మారుతున్న ఈ  ప్రమాదకర ఆట తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తోంది. ఎంతోమంది పిల్లలు వెంటనే అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. లక్షలాదిమంది పిల్లలు, యువత వీటిని చూసి అనుసరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ప్రమాదాన్ని గుర్తించని ఉత్సాహం
తెలిసీ తెలియని వయసులో టీనేజ్‌ పిల్లలు, థ్రిల్‌ ఫీల్‌ అవుతున్న యువత ఈ ఆటలోని ప్రమాదాన్ని గుర్తించడం లేదు. మొదట టిక్‌టాక్‌లో మొదలైన ఛాలెంజ్‌ వెంటనే ఇతర సోషల్‌ మీడియా వేదికలు అయిన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలోనూ వైరల్‌గా మారింది. అతి కొద్ది రోజుల్లోనే ఈ వీడియోలకు ఏకంగా 48 లక్షల వ్యూస్‌ వచ్చాయంటే ఈ ఆట వైపు టీనేజ్‌ పిల్లలు ఎంతగా ఆకర్షితులవుతున్నారో తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవుతున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా కూడా మారింది. 

ఆ వీడియోలు తొలగించండి
ఈ తరహా వీడియోలు మరింత ప్రచారం పొందకుండా వెంటనే తొలగించా లని టిక్‌టాక్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా వేదికలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆదేశించింది. అయితే సరైన నియంత్రణ కొరవడిన నేపథ్యంలో ఇప్పటికీ ఈ ఆట వీడియోలు వాట్సాప్‌ వంటి వాటిల్లో వైరల్‌ అవుతుండటం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తక్షణం ఈ ‘స్కల్‌ బ్రేకింగ్‌ ఛాలెంజ్‌’ను, ఈ వీడియోలు వైరల్‌ కావడాన్ని నిషేధించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రాణాలు తీస్తున్న గేమ్స్‌ను కట్టడి చేయాలి
ఇటీవలి కాలంలో వాట్సాప్, యూ ట్యూబ్‌లలో హల్‌చల్‌ చేస్తున్న వీడియో గేమ్స్‌ వలన యువత ప్రాణాలను కోల్పోతు న్నారు. పబ్జీ గేమ్, స్కల్‌ బ్రేకింగ్‌ ఛాలెంజ్‌ వంటి ప్రాణాంతక ఆటలను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
– అల్లం భువన్‌కుమార్, ఊర్మిళానగర్, విజయవాడ

సరైన అవగాహనతోనే కట్టడి సాధ్యం
టీనేజ్‌ పిల్లల్లో సహజంగా ‘థ్రిల్‌ సీకింగ్‌’ మనస్తత్వం ఉంటుంది. అందుకే ‘స్కల్‌ బ్రేకింగ్‌ ఛాలెంజ్‌’ వంటి ప్రాణాంతక ఆటల వైపు ఆకర్షితుల వుతుంటారు. తోటి విద్యార్థికి హాని చేయాలని వారికి ఉండదు. కేవలం థ్రిల్‌ కోసం చేస్తారు. కానీ అదే ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి విద్యార్థులకు ఇంట్లో తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు సరైన అవగాహన కల్పించాలి. అలాంటి వీడియోలను పెద్దలే దగ్గరుండి చూపించి వాటితో జరిగే ప్రమాదాన్ని వివరించాలి.
–  డాక్టర్‌ ఇండ్ల విశాల్, మానసిక వైద్య నిపుణుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top