నిధులు మింగిన ఉద్యోగులపై వేటు | Six cc suspension in bhadrachalam | Sakshi
Sakshi News home page

నిధులు మింగిన ఉద్యోగులపై వేటు

Jan 17 2014 5:08 AM | Updated on Sep 2 2017 2:40 AM

భద్రాచలం ఇందిరాక్రాంతి పథం పాలనను గాడిలో పెట్టేందుకు ఐటీడీఏ పీవో వీరపాండియన్ ఎట్టకేలకు దృష్టి సారించారు.

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ఇందిరాక్రాంతి పథం పాలనను గాడిలో పెట్టేందుకు ఐటీడీఏ పీవో వీరపాండియన్ ఎట్టకేలకు దృష్టి సారించారు. ఐకేపీ ద్వారా అర్హులకు పథకాలను అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా...అడ్డగోలుగా నిధులు కొల్లగొడుతున్న సిబ్బందిపై కఠినంగానే వ్యవహరించారు. ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(టీపీఎంయూ) పరిధిలోని ఇందిరాక్రాంతి పథంలో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రికలో వ రుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన పీవో  అక్రమార్కులపై వేటు వేసేందుకు నిర్ణయించారు.
 
 విద్యార్థులకు అందజేయాల్సిన ఉపకార వేతనాలు, గ్రెయిన్ బ్యాంకు నిధులు, అభయ హస్తం ద్వారా మంజూరైన పింఛన్‌లను అర్హులైన వారికి ఇవ్వకుండా కాజేసిన ఆరుగురు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీసీ)ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం  పీవో ఉత్తర్వులు జారీ చేశారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక క్లస్టర్ సీసీ జీ.ప్రభాకర్, పర్ణశాల ఎంబీకే టీ. వెంకటేశ్వర్లు, తూరుబాక సీసీ పీ. మోహన్‌రావు, దుమ్ముగూడెం క్లస్టర్ సీసీ. శంకరమ్మ, మారాయిగూడెం సీసీ జీఆర్‌కే స్వామి, ఆర్లగూడెం సీసీ ఐ.రామకృష్ణ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. రామకృష్ణ ప్రస్తుతం వెంకటాపురంలో పనిచేస్తుండగా, స్వామి వీఆర్ పురం మండల ఏపీఎంగా పనిచేస్తున్నారు. మిగతా నలుగురు దుమ్ముగూడెం మండలంలోనే పనిచేస్తూ ఇటీవల టీపీఎంయూ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. ఉపకార వేతనాలు, గ్రెయిన్ బ్యాంకు, అభయహస్తం పింఛన్‌లకు సంబంధించి మంజూరైన నిధులను లబ్ధిదారులకు అందజేయకుండా ఫోర్జరీ సంతకాలతో దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడి కావటంతోనే వారిపై చర్యలు తీసుకున్నట్లు పీవో వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
 
 గాడిలో పెట్టేందుకే...
 ఇందిరాక్రాంతి పథం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరవుతున్న నిధులను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పింఛన్‌లతో పాటు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల నిర్వహణపై కూడా వీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టీపీఎంయూ పరిధిలో గల చింతూరు, కూనవరం, దుమ్ముగూడెం, వెంకటాపురం, మణుగూరు తదితర మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యహారంపై ‘సాక్షి’లో  కథనాలు వచ్చిన నేపథ్యంలో సెర్ఫ్ చీఫ్ విజిలెన్స్ అధికారి రాజబాబు నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇటీవల భద్రాచలం వచ్చి విచారణ జరిపింది. వీరి నివేదిక ఆధారంగా మరి కొంతమంది సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖలోని ఓ అధికారి తెలిపారు. ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు బాధ్యతలతో పాటు వివిధ పథకాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను ప్రస్తుతం ఐకేపీ సిబ్బంది చూస్తున్నారు. చాలా మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదని అసంతృప్తితో ఉన్న పీవో వీరపాండియన్ ఐకేపీని గాడిలో పెట్టేందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనేవ్యాఖ్యలు నిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement