ఐదో రోజూ అదే వరస

Sit Officials Delayed In YS Jagan Murder Attempt Case - Sakshi

అడుగు ముందుకు పడని ‘సిట్‌’ విచారణ

కుట్రదారులెవరో తెలియలేదంటూ దాటవేత

కస్టడీ పొడిగింపుపై నేడు పిటిషన్‌?

సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల క్రితం సరిగ్గా ఇదే రోజు.. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై అత్యంత భద్రతా వ్యవస్థ కల్గిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వీఐపీ లాంజ్‌లో హత్యాయత్నం జరిగింది. ఘటన జరిగిన గంటలోనే పోలీస్‌బాస్‌ డీజీపీ నిందితుడిపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసేశారు. ఆ కొద్దిసేపటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాజకీయ రంగు పులిమేశారు. ఆ తర్వాత ఘటన జరిగిన ప్రాంతం మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ.. నాటకంలా మొదలై కస్టడీలో నిందితుడు ఏమాత్రం సహకరించడం లేదంటూ రోజు చెప్పిందే చెబుతున్న తీరు వరకు.. సిట్‌ విచారణ నిజంగా హై డ్రామాను తలపిస్తోంది.

పోలీస్‌ బాస్‌ మాట జవదాటని రీతిలో సాగుతున్న విచారణ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందంగా సాగుతోంది. మొత్తానికి ఈ కేసు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. నిందితుడి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టలేకపోయమని చెప్పుకొచ్చిన సిట్‌ ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందంటూనే రెండువారాల కస్టడీ కోరింది. షరతులకు లోబడి ఆరు రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతివ్వగా రోజుకో రీతిలో విచారణ సాగిస్తూ చుట్టూ తిరిగి తమ పోలీస్‌ బాస్‌ చెప్పినట్టుగానే కథ ముగించే పనిలో సిట్‌ అధికారులు నిమగ్నమైనట్టు కన్పిస్తోంది. కస్టడీ సందర్భంగా గడిచిన నాలుగు రోజుల్లో ఎలాంటి పురోగతి సాధించని సిట్‌ విచారణ ఐదో రోజు కూడా అదే వరసలో సాగింది. గురువారం నిందితుడి తల్లిదండ్రుల నుంచి అతని ప్రవర్తన, నడవడిక, ఆలోచనా విధానంపై ఆరా తీయడం, రోజు మాదిరీ నిందితుడి స్నేహితురాలు రమాదేవి, రేవతిపతిలతో పాటు మరో ముగ్గురు సహ ఉద్యోగులను వివిధకోణాల్లో విచారించారు. కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న హర్షవర్థన్‌ గురువారం కూడా పిలిచి విచారించి ఎప్పటిలాగే వదిలి పెట్టేశారు.

కాల్‌ డేటా విశ్లేషిస్తూనే ఉన్నారు
కాల్‌ డేటా ఆధారంగా 321 మందికి కాల్‌ చేసి వారితో నిందితునికి ఉన్న సంబంధం, ఎందుకు కాల్‌ చేసాడు? ఏం మాట్లాడాడు? ఈ హత్యాయత్నం కోసం ఏమైనా చెప్పాడా? అన్న అంశాలపై ఆరా తీసి వారి స్టేట్‌మెంట్స్‌ రికార్డ్‌ చేశారు. మరో వైపు సీసీ కెమెరాల పుటేజ్‌ ఆధారంగా గడిచిన నెల రోజులుగా నిందితుని నడవడిక, వ్యవహార శైలిని పరిశీలించేందుకు ఐదుగురు నిపుణులతో విశ్లేషిస్తున్నారు.

విచారణ మళ్లీ వాయిదా
ఘటన జరిగిన రోజు జగన్‌ ధరించిన చొక్కా ఇప్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను విశాఖ మూడో మెట్రో పాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో శనివారానికి వాయిదా పడింది. 11 పేజీల లేఖతో పాటు ఘటన తర్వాత ఠానేలంకలో స్వాధీనం చేసుకున్న ఫ్లెక్సీని పరీక్షించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అదే విధంగా సీఆర్‌పీసీ 160 ప్రకారం నోటీసులు జారీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు వాంగ్మూలం ఇవ్వని కారణంగా కోర్టు ద్వారా మెమో దాఖలు చేయాలని మరో పిటిషన్‌ వేశారు.

ఆరోగ్యం బేషుగ్గా ఉందన్న వైద్యులు
నిన్నగాక మొన్న కోర్టు ఆదేశాల మేరకు ప్రతి 48 గంటల కోసారి నిందితునికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగానే కేజీహెచ్‌కు తరలించామని సీపీ మహేష్‌చంద్ర లడ్డా చెప్పుకొచ్చారు. కానీ 24 గంటలైనా కాకముందే బుధ, గురువారాలు కేజీహెచ్‌ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కేజీహెచ్‌ వైద్యుడు డాక్టర్‌ సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య బృందం సుమారు గంటకు పైగా పరీక్షలు నిర్వహించి నిందితుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ప్రకటించారు. పల్స్‌ రేట్‌ 82, బీపీ 110/80, షుగర్‌ లెవల్‌ 130 ఉందని ప్రకటించారు. అంతకు ముందే నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో విశాఖ మానసీకాలయంలో తరలించాలన్న ఆలోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్టుగా మీడియాకు లీకులిచ్చారు. కానీచివరకు స్టేషన్‌లోనే వైద్య పరీక్షలతో సరిపెట్టారు.

పురోగతి ఉందంటూనే..
నాలుగు రోజులతో పోలిస్తే ఐదో రోజు ఈ కేసులో కాస్త పురోగతి సాధించామని సిట్‌ను పర్యవేక్షిస్తున్న నయీమ్‌ అద్నన్‌ అస్మీ చెప్పుకొచ్చారు. ఆ పురోగతి ఏమిటో చెప్పమంటే మాత్రం సమాధానం దాటవేశారు. శ్రీనివాసరావుతో ఈ ఘాతుకానికి పాల్పడిన కుట్రదారులు, సూత్రదారులెవరనేది తెలిసిందా? అని ప్రశ్నిస్తే రేపు తెరపై చూడండంటూ చెప్పుకొచ్చారు. కస్టడీని పొడిగిస్తారా? అంటే దానికి శుక్రవారమే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలా మొత్తమ్మీద కస్టడీలో విచారణ మొత్తం నిందితుడి చుట్టూ తిరిగిందే తప్ప ఒక్క అడుగు కూడా మందుకు పడలేదన్న విమర్శలు బాహాటంగానే విన్పిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top