చిలక చిక్కింది!

Shipwrecked in 1917 in the coast of Srikakulam district - Sakshi

శ్రీకాకుళం జిల్లా బారువ తీరంలో 1917లో నౌక మునక

సుడిగుండాల వెనుక రహస్యాన్ని ఛేదించిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందం

ఒడ్డు నుంచి 400 మీటర్ల దూరంలో శిథిలావస్థలో ఉన్న నౌక

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక తిన్నెలతో అలరించే సుందర బారువా తీరం ఒకవైపు.. మహేంద్ర తనయ నదీ సంగమం మరోవైపు. పచ్చని ప్రకృతి పరచుకునే తోటలతో శ్రీకాకుళం జిల్లాలోని ఈ తీర ప్రాంతం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు బీచ్‌ వదిలి వెళ్లినా ఓ  సందేహాన్ని మాత్రం వెంట తీసుకెళ్తుంటారు. బీచ్‌లో కొంతదూరంలో కనిపించే ఆ కర్ర ఏమిటని..? 

సుడిగుండాల భయంతో.. 
అవి.. ‘చిలకా’ అనే పేరున్న నౌక ఆనవాళ్లు. ఎప్పుడో వందేళ్ల నాడు మునిగిపోయిందని స్థానికులు చెబుతుంటారే తప్ప సుడిగుండాల భయంతో అక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన లివిన్‌ అడ్వెంచర్స్‌ స్కూబా డైవింగ్‌ బృందం సుడిగుండాల వెనుక రహస్యాల్ని ఛేదించింది. 
నౌక అవశేషాలు   

స్కూబా డైవింగ్‌తో అన్వేషణ 
బారువ సముద్ర తీరంలో ఈనెల 27వతేదీన ముగ్గురితో కూడిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందం పరిశోధన మొదలైంది. ఇన్‌స్ట్రక్టర్‌ బలరాం నాయుడు, డైవ్‌ మాస్టర్‌ రాహుల్, అడ్వాన్స్‌ డైవర్‌ లక్ష్మణ్‌ సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేస్తూ అన్వేషణ ప్రారంభించారు. ఒడ్డుకు 400 మీటర్ల దూరంలో ఉన్న కర్ర వద్దకు చేరుకున్నారు. సాగర గర్భంలో 7 మీటర్ల లోతు వెళ్లాక వారికి నౌక అవశేషాలు కనిపించాయి. శిథిలావస్థలో ఉన్న నౌకలో గోలియత్‌ గ్రూపర్స్, లయన్‌ ఫిష్, ఎలక్ట్రిక్‌ రే, సిల్వర్‌ మూనీ తదితర జలచరాలు నివాసమున్నట్లు గుర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో గడిపి నౌక వివరాలను సేకరించారు. నౌక వెనుక భాగం పైకి ఉండటం వల్ల అలలు వచ్చినప్పుడు ఆ తాకిడికి రిప్‌ కరెంట్‌లా మారి సుడిగుండాలు ఏర్పడినట్లు కనిపిస్తుంటుందని, ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. 
సాహస యాత్ర చేసిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందం   

‘నౌక పూర్తిగా శిథిలమైంది. అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెబుతున్న భాగాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల అలలు ఉధృతంగా వెనుక భాగానికి తగిలి సుడిగుండాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా నౌక వెడల్పు కొలవలేకపోయాం. గతంలో మా బృందం విజయనగరం జిల్లా చింతపల్లి తీరంలో, విశాఖ జిల్లా భీమిలి తీరంలో మునిగిన నౌకల్ని అన్వేషించింది. 
– బలరాం నాయుడు (లివిన్‌ అడ్వెంచర్‌ సంస్థ ఇన్‌స్ట్రక్టర్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top