7వ ఆర్థిక గణన సర్వే ఆరంభం

తలసరి ఆదాయం  మొబైల్‌ యాప్‌లో నమోదు 

కలెక్టర్‌ అధ్యక్షతన 14 శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు

దారిద్యరేఖ లెక్క తేల్చేందుకు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ 

సాక్షి, ఒంగోలు:కుటుంబ ఆర్థిక స్థితిగతులపై వివరాల సేకరణకు కసరత్తు మొదలైంది. 7వ ఆర్థిక గణన సర్వేను జిల్లాలో మంగళవారం కలెక్టర్‌ పోల భాస్కర్‌ లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా వంద రోజుల్లో సర్వే పూర్తి చేసి వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ సర్వే ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ ఎందరు ఉన్నారో లెక్క తేల్చనున్నారు. ఈ తరహా సర్వేలు ఇప్పటికి ఆరు పూర్తయ్యాయి. ఈ నివేదికల ఆధారంగానే తలసరి గ్రాంటులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ మాన్యువల్‌గా జరగగా ఈ ఏడాది సర్వే డిజిటల్‌ ఇండియాను దృష్టిలో ఉంచుకొని కాగిత రహితంగా చేయనున్నారు. మొట్టమొదటి సారిగా ఆర్థిక గణన సర్వేకి మొబైల్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. కుటుంబాల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వాల నుంచి సహాయం, వివిధ రకాల సహాకారం అందనుంది. ఎంతో కీలకమైన ఆర్థిక గణన కుటుంబాల్లో తలసరి ఆదాయాల లెక్క తేల్చనుంది.
పట్టణాలు, పల్లెల్లో వేర్వేరుగా..
జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి కాకుండా 35 అటవీ గ్రామాలు ఉన్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 12.5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా 7వ ఆర్థిక గణన సర్వే జరగనుంది. వీరిలో భూమి కలిగిన వారు 7.22 లక్షలు, మధ్య తరహా రైతులు 4.32 లక్షలు, చిన్నతరహా రైతులు 1.78 లక్షల మంది ఉన్నారు. వీరి వివరాలను సర్వే ద్వారా సేకరిస్తారు. 

ఎన్యూమరేటర్ల ఎంపిక
ఆర్థిక గణన సర్వే కోసం ఎన్యూమరేటర్ల ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నగరంతో పాటు మున్సిపాలిటీలు, పట్టణ పాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో సర్వే విడివిడిగా జరగనుంది. ఏడవ ఆర్థిక గణన సర్వేను గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్ధిక గణాంక శాఖ, జాతీయ శాంపుల్‌ సర్వే, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టింది. ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫ్‌ర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారితో నియమించిన కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌.. ఈ గవర్నెన్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ సర్వేను సంయుక్తంగా అమలు చేస్తోంది. 

ఆర్థిక లెక్క తేలుతుంది..
సర్వే ద్వారా కుటుంబాల ఆర్థిక లెక్క తేలనుంది. కార్యక్రమం దేశం భౌగోళిక సరిహద్దుల్లోని అన్ని సంస్థల పూర్తి లెక్కలను, అసంఘటిత రంగంలోని కుటుంబాల వారి వివరాలను సర్వేద్వారా అందిస్తోంది. అన్ని సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల కోసం ఆర్ధిక కార్యకలాపాల భౌగోళిక వ్యాప్తి జిల్లాలోని రకరకాల యాజమాన్యాల నమూనాలు, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తుల ఉద్యోగులు ఇతర విలువైన సమాచారాన్ని సేకరించనున్నారు.

మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సర్వే..
సర్వే కచ్చితత్వం కోసం మొబైల్‌ యాప్‌ ద్వారా చేపట్టారు. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదల చేశారు. గతంలో నిర్వహించిన 6వ గణన కార్యక్రమం మాన్యువల్‌గా చేసినందున సమగ్ర నివేదిక రావడానికి నెలల పాటు కాలహరణం జరిగింది. 2013లో ఈ గణన సర్వే వివరాలు 2016లో గానీ అవుట్‌పుట్‌ విడుదల కాలేదు. ఈ దఫా సర్వేలో ఈ ఇబ్బందులు లేకుండా డిజిటల్‌ ఇండియా నియమాలను అనుసరించి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సర్వే చేయనున్నారు. ఇందు కోసం ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. జియో ట్యాగింగ్, టైమ్‌ స్టాంపింగ్, యాప్‌ లెవల్‌ డేటా  ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పై స్థాయి అధికారులకు అప్‌లోడు చేయడం కోసం సులభతరంగా వీటిని రూపొందించారు.

ఎన్యుమరేటర్ల పైన సూపర్‌వైజర్లు లెవన్‌–1 , లెవల్‌–2 అధికారులు ఉన్నారు. ఎన్యుమరేటర్లకు ప్రైవేటు వ్యక్తులను నియమించారు. వీరికి ఎస్‌ఎస్‌సి విద్యార్హత ఉంటే సరిపోతుంది. 1028 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. వీరు కాకుండా పట్టణ,నగర పాలక సంస్థ పరిధిలో ఎన్యుమరేటర్లను ప్రత్యేకంగా నియమించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని లెవల్‌–1 అధికారి తనిఖీ చేసి సర్వే సరిగ్గా వచ్చిందని బావిస్తే లెవల్‌–2 అధికారికి పంపుతారు. అక్కడి నుంచి యాప్‌ ద్వారా అప్‌లోడు చేస్తే సర్వే నివేదికకు చేరుతుంది. ఈ పద్దతిలో సర్వే అవుట్‌పుట్‌ జనవరి ఆఖరుకే ప్రభుత్వానికి ఇవ్వడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సూపర్‌వైజర్లకు ఇప్పటికే డీఈఎస్, ఎన్‌ఎస్‌వో, సీఎస్‌ఈ సంస్థలు శిక్షణ ఇచ్చాయి. 
కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ..

ఆర్థిక సర్వేకి కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ నియమించారు. జిల్లా స్థాయి కమిటీ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. జిల్లా ఎస్పీ, సీపీవో, ఇతర 14 శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పోగ్రాం ఇంప్లిమెంట్‌ జిల్లా మేనేజర్‌ ప్రమోద్‌కుమార్‌ సూపర్‌వైజర్ల పనితీరు, ఆపై అధికారుల పని తీరును పర్యవేక్షిస్తుంటారు. సర్వేని రెండు రకాలుగా చేస్తారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్‌ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్‌ దుకాణాలు ఉన్న వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. నార్మల్‌ హౌస్‌హోల్డ్, సెమి నార్మల్‌ హౌస్‌హోల్డ్, కమర్షియల్‌ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఎంతో కీలకమైన ఈ ఏడవ ఆర్ధిక గణన సర్వేను జిల్లాలో వంద రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top