దక్షిణాదిలో భద్రత కట్టుదిట్టం

Security Tightened In South India After Sri Lanka Terror Attack - Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంకలో ఉగ్రఘాతుకం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవాలోని సున్నితమైన ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా భద్రతను పెంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చర్చిల వద్ద భారీగా అదనపు బలగాలను మోహరించారు. కాగా, ఉగ్రదాడి జరగొచ్చని భారత నిఘావర్గాలే శ్రీలంకను ముందుగా హెచ్చరించాయా? అన్న విషయమై భారత నిఘా సంస్థలు మౌనం పాటిస్తున్నాయి.  (శ్రీలంకలో మారణ హోమం; ఆగని కన్నీళ్లు)

శ్రీలంకలో చిక్కుకున్న ఏలూరు వాసులు
అంతా క్షేమమని సమాచారం
ఏలూరు టౌన్‌: శ్రీలంకలోని ట్రిన్‌కోమలి శక్తిపీఠం సందర్శనకు వెళ్లిన 18 మందితో కూడిన భక్త బృందం వరుస బాంబు పేలుళ్ల ఘటనతో అక్కడ చిక్కుకుపోయింది. ఏలూరు, పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది శ్రీలంకలోని జాఫ్నా, కొలంబో, ట్రిన్‌కోమలి శక్తిపీఠం, అశోకవనం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు ఈనెల 18న బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 15 మంది భక్తులు శ్రీలంక వెళ్లినట్టు ఇక్కడకు సమాచారం అందింది. ఈస్టర్‌ రోజున కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

భక్త బృందంలోని మురళీకృష్ణతో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ‘సాక్షి’ విలేకరి మాట్లాడగా.. ఏలూరుకు చెందిన 18 మంది భక్తులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. తామంతా కొలంబో ఎయిర్‌ పోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. మంగళవారం తామంతా ఏలూరు చేరుకుంటామని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు జరగటానికి ముందు రోజున తామంతా కొలంబోలోని హోటల్‌లో ఉన్నామని తెలిపారు. భగవంతుడి దయతో శనివారం రాత్రి ఆ ప్రాంతం నుంచి బయలుదేరి జాఫ్నాకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. (చదవండి: లంకకు ఇప్పట్లో వద్దు బాబోయ్‌ ..!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top