తిరగబడ్డ తమ్ముళ్లు | seat war in tdp leaders | Sakshi
Sakshi News home page

తిరగబడ్డ తమ్ముళ్లు

Apr 11 2014 12:24 AM | Updated on Jul 28 2018 6:33 PM

తిరగబడ్డ తమ్ముళ్లు - Sakshi

తిరగబడ్డ తమ్ముళ్లు

సీట్ల కేటాయింపులో అధినేత వైఖరిపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో నియోజకవర్గాల్లో కేడర్ మధ్య వివాదాలు మరింత పెరుగుతున్నాయి.

  • టీడీపీలో భగ్గుమంటున్న  అసమ్మతి సెగ
  •  సీట్ల పంపిణీలో అధినేత వైఖరిపై మండిపాటు
  •  గుంటూరులో తెలుగు యువత ర్యాలీ
  •  పార్టీ కార్యాలయం వద్ద ఫర్నిచర్ ధ్వంసం
  •  అభ్యర్థుల ప్రకటనకు ముందే రెబె ల్స్ బెడద
  •  ఎంపిక చేసిన వారిని ఓడిస్తామని అధినేతకు హెచ్చరికలు
  • సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీట్ల కేటాయింపులో అధినేత వైఖరిపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో నియోజకవర్గాల్లో కేడర్ మధ్య వివాదాలు మరింత పెరుగుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించక ముందే రెబెల్స్‌గా బరిలో దిగుతామనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

    పనిచేసిన నాయకులకు కాకుండా పైరవీలకు, పలుకుబడి, పైసలున్న వారికే ప్రాధాన్యత ఇస్తుండటంపై నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏ నియోజకవర్గం ఎవరికి కేటాయిస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో కొందరు హైదరాబాద్‌లోనే మకాం వేసి ఉంటే మరికొందరు అధినేత నిర్ణయాలకు విసిగి నియోజకవర్గాల్లోనే ఉండిపోయారు.
     
    పార్టీ కార్యాలయం వద్ద విధ్వంసం..

    తెలుగు యువత కార్యకర్తలు గురువారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అధినేత నిర్ణయంలో మార్పు రాకపోతే ఎంపిక చేసిన అభ్యర్థులను ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా టీడీపీలో ఒక్కసారిగా అసమ్మతి పెల్లుబికింది. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు(మల్లి)కు సత్తెనపల్లి టిక్కెట్టు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున జిల్లాలోని యువత నాయకులు, కార్యకర్తలు గురువారం గుంటూరులో ర్యాలీ నిర్వహించారు.

    అరండల్‌పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కోడెల, చంద్రబాబులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లేశ్వరరావుకు టిక్కెట్టు కేటాయించాల్సిందేనంటూ పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. అరుపులు, కేకలతో పార్టీ కార్యాలయం దద్దరిల్లింది. పార్టీని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన తెలుగు తమ్ముళ్లు కుర్చీలను విరగొట్టి, పార్టీ కార్యాలయం తలుపుల అద్దాలను పగలకొట్టి నిరసన తెలిపారు. అనంతరం కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.
     
    తిరుగుబాటుకు సన్నద్ధం..
    మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు సత్తెనపల్లి సీటు కేటాయించినట్టు పార్టీ నుంచి సమాచారం రావడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ తిరుగుబాటును ప్రకటించారు. పార్టీని నియోజకవర్గంలో ఇంతకాలం నడిపిన తనను విస్మరించినందుకు నిరసనగా ఈ నెల 16న నామినేషన్ వేయనున్నట్టు ప్రకటించారు. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గానికి ఓసిలకు ఎలా కేటాయిస్తారని వర్గానికి చెందిన ప్రజలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు.
     
    గుంటూరు తూర్పులోనూ రగడ

    మైనార్టీలు అధికంగా ఉన్న గుంటూరు తూర్పును వైశ్య సామాజికవర్గానికి కేటాయించేందుకు అధినేత సుముఖంగా ఉన్నట్టు తెలుసుకున్న మైనార్టీలు నియోజకవర్గంతో తిరుగుబాటును చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. 42 వేల ఓటర్లు ఉన్న తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా పోటీ చేసి గెలిచారని, ఇప్పుడు 20 వేల లోపు ఓటర్లు కలిగిన వైశ్య సామాజికవర్గానికి కేటాయించేందుకు పావులు కదపడం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అధినేత వైశ్య సామాజికవర్గం అభ్యర్థిని ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలో ఆందోళనలు చేపట్టేందుకు మైనార్టీలు సమయాత్తం అవుతున్నారు.
     
    16న టీడీపీ రెబెల్‌గా వేల్పుల నామినేషన్..

    నరసరావుపేట నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించినప్పటి నుంచీ, పార్టీనేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో దానిని మంగళగిరికి మార్చే అవకాశం ఉందని పార్టీలో వినపడుతోంది. దీంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నరసరావుపేట బీజేపీకి కేటాయిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్ ఈ నెల 16వ తేదీన రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.

    బీసీ అభ్యర్థిగా నరసరావుపేట లేదా సత్తెనపల్లి సీటు ఇస్తారని ఆశించిన వేల్పుల బీజేపీతో పొత్తులో భాగంగా నరసరావుపేటను ఆ పార్టీకి కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీట్ల ఖరారులో రోజుకో కొత్తపేరు వినవస్తుండటంతో నియోజకవర్గాల్లో అధినేతల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement