పొత్తు పొడిచింది! | Seat sharing finalised between TDP, BJP | Sakshi
Sakshi News home page

పొత్తు పొడిచింది!

Mar 12 2014 2:20 AM | Updated on Mar 29 2019 9:18 PM

పొత్తు పొడిచింది! - Sakshi

పొత్తు పొడిచింది!

బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉంది.

సాక్షి, హైదరాబాద్: బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై మైనారిటీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాగైతే మైనారిటీ ఓటు ఒక్కటీ పడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక, సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణల్లో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌లు ప్రధాన శత్రువులన్నారు. 
 
భవిష్యత్ అవసరాలు, జాతీయరాజకీయాల్లో పార్టీ పోషించాల్సిన పాత్ర దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయాలని సూచించారు. సాధారణ ఎన్నికలు పార్టీకి ముఖ్యం కాబట్టి బీజేపీ ఎన్ని స్థానా లు కోరితే అన్ని ఇవ్వాలన్నారు. టీడీపీతో పొత్తుండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెపుతుండడాన్ని పార్టీ నేతలు దృష్టికితేగా.. స్థానిక బీజేపీ నేతల్ని పట్టించుకోనక్కర్లేదని బాబు చెప్పారు. తాను నిత్యం బీజేపీ జాతీయ నేతలతో టచ్‌లో ఉన్నానని, వారూ తనతో చర్చలు జరుపుతున్నారన్నారు. 
 
 మైనార్టీ నేతల్లో ఆగ్రహం: బీజేపీతో పొత్తుకు బాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటం పై పార్టీలోని మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011 లో హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశానని, దీనివల్ల మైనార్టీలు దూరమయ్యారని, మళ్లీ అలాంటి పొరపాటు చేయనని చెప్పిన క్షమాపణలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
 
బాబు వైఖరికి నిరసనగా పొలిట్‌బ్యూరో సభ్యు డు, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకుడు జాహెద్ ఆలీఖాన్ పార్టీని వీడాలని నిర్ణయించగా.. మరికొందరూ ఇదేబాటలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు నగరానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను బాబు సూచన మేరకు ఎంపీ సుజనా చౌదరి కలిశారు. పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే తాను వ్యక్తిగతంగా కలిశానని సుజనా చెప్పడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement