హాజరుకానున్న ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ యవనికపై భారతీయ జనతా పార్టీ తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మే 9న కోల్‌కతాలోని చారిత్రక ‘బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్’వేదికగా, నవ శకానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మే 9న ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనమైన రవీంద్రనాథ్ టాగోర్ జయంతి (మే 9 – 25వ వైశాఖం) రోజు ప్రమాణ స్వీకారం జరగనుండటం విశేషం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, సమిక భట్టాచార్య, సుకాంత మజుందార్, స్వపన్ దాస్‌గుప్తాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘భూమిపుత్రుడి’కే పట్టాభిషేకం చేయాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది.
‘రైటర్స్ బిల్డింగ్స్’కు పూర్వవైభవం
సుమారు 250 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన, కోల్‌కతా నడి»ొడ్డున ఉన్న ‘రైటర్స్ బిల్డింగ్స్’తిరిగి రాష్ట్ర సచివాలయంగా రూపుదిద్దుకోనుంది. మమతా బెనర్జీ హయాంలో హూగ్లీ నది అవతలి ఒడ్డున నిర్మించిన ‘నబన్నా’నుంచి పరిపాలన సాగగా, ఇప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం, తిరిగి పాత సచివాలయం నుంచే పాలన అందించాలని నిర్ణయించింది. రైటర్స్ బిల్డింగ్స్‌లో మరమ్మతులు పూర్తయ్యే వరకు, కొత్త ముఖ్యమంత్రి అసెంబ్లీ ఆవరణలోని ‘అనెక్స్ బిల్డింగ్’నుంచి పాలనను నిర్వహించే అవకాశం ఉంది.


