గౌరవ వేతనం అం(తే)దేనా..?

Sarpanch Wages Low In Chittoor - Sakshi

30 నెలలుగా పెండింగ్‌లో సర్పంచ్‌ల వేతనాలు మరో 20 రోజుల్లో

ముగియనున్న పదవీ కాలం జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్లు పెండింగ్‌

సర్పంచ్‌ల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కెలా తయారైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలను వేసి సర్పంచ్‌లకు పూర్తిగా అధికారాలు లేకుండా చేసింది. పైగా గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.

మదనపల్లె రూరల్‌: జిల్లాలోని సర్పంచ్‌లకు 30 నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. మరో 20 రోజుల్లో వారి పదవీ కాలం ముగియనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు ఇస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 66 మండలాల్లో 1,393 మంది సర్పంచ్‌లు ఉన్నారు. వీరికి నెలకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం 2015లో ప్రకటించింది. తర్వాత 9 నెలలు చెల్లించింది. 2016 నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు. నెలకు రూ.41.79 లక్షల చొప్పున 30 నెలలకు రూ.12 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. తమ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుందని, గౌరవ వేతనాల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబు తున్నారు. ప్రస్తుతం ఒక్కో సర్పంచ్‌కు రూ.90 వేలు రావాల్సి ఉంది.  

పెండింగ్‌లో బిల్లులు..
జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులు చేసి పనులు చేయించామని, బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ట్రెజరీల్లో సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో బిల్లుల మంజూరు విధానం ప్రవేశ పెట్టడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు సైతం మంజూరుకావడం లేదని వాపోతున్నారు. తమ పదవీ  కాలం ముగిసేలోగా పెండింగ్‌ బిల్లులతో పాటు గౌరవ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకో వాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

వెంటనే మంజూరు చేయాలి
సర్పంచ్‌లకు గౌరవ వేతనం పెంపు అనంతరం 9 నెలలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 30 నెలలకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు. పదవీ కాలం ముగుస్తోంది. వేతనాలు వెంటనే ఇవ్వాలి. పంచా యతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అవస్థలు పడుతున్నాం.   – నాగరత్నమ్మ, సర్పంచ్, కొండామారిపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top