శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అమ్మవారి ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కోరిన కోర్కెలు తీర్చిన తల్లికి భక్తులు సమర్పించిన చీరలు, రవికెలను అధికారులు సరైన రీతిలో భద్రపరడం లేదు. కనీసం వాటిని విక్రయించేందుకు ఆక్షన్ కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో విలువైన చీరలు పాడైపోతున్నాయి. చీరల విక్రయ హక్కుల కోసం నిర్వహించే ఆక్షన్ ప్రతిసారి వివాదాస్పదం అవుతోంది. గతంలో దేవస్థాన సిబ్బంది సేకరించిన రూ.28లక్షల విలువైన చీరలను విక్రయానికి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
తొలిసారి 2010 మే నెలలో ఆక్షన్ నిర్వహించి అమ్మవారి చీరల విక్రయ బాధ్యతను కాంట్రాక్టరుకు అప్పగించారు. అప్పటి వరకు దేవస్థాన సిబ్బందే చీరలను వేలం ద్వారా విక్రయించేవారు. కొత్తగా కాంట్రాక్టర్‌కు ఈ బాధ్యతలు అప్పగించే సమయానికి దేవస్థానం వద్ద సుమారు రూ.28లక్షల విలువైన చీరలు ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. ఆ తర్వాత వాటిని విక్రయించకుండా గోడౌన్లలోనే పడేశారు.
ప్రస్తుతం రూ.90లక్షల విలువైన చీరలు...
గత ఏడాది బోస్ అండ్ బోస్ సంస్థకు ఈవో అప్పగించిన చీరల కాంట్రాక్టును దేవాదాయ శాఖ కమిషనర్ రద్దు చేశారు. బోస్ అండ్ బోస్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లగా, వారి వద్ద ఉన్న సరుకును మాత్రమే అమ్ముకోవాలని గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు భక్తులు సమర్పించిన చీరలను దేవస్థాన అధికారులే పోగు చేసి భద్రపరిచారు. ప్రస్తుతం సుమారు రూ.90లక్షల విలువైన చీరలు దేవస్థానంలో ఉన్నాయి.
ఇటీవల మళ్లీ ఆక్షన్ నిర్వహించి రవికుమార్ అనే వ్యక్తికి చీరలు పోగు చేసుకునే కాంట్రాక్టును అప్పగించారు. ఆయన డిసెంబర్ ఒకటో తేదీ నుంచి చీరలు పోగు చేసుకుని విక్రయించనున్నారు. ఈ క్రమంలో పాత కాంట్రాక్టర్ మరొకసారి పాత కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లారు. నవంబరు నెలాఖరు వరకు సరుకు అమ్ముకునేందుకు అనుమతివ్వడంతోపాటు ఈ నెలలో వచ్చిన చీరలు కూడా తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
కాంట్రాక్టర్లు చీరలు పోగు చేసుకునేందుకు పోటీ పడుతుండగా, ఇప్పటికే ఉన్నవాటిని విక్రయించేందుకు దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించిన విలువైన చీరలను చుట్టచుట్టి గోడౌన్‌లో కుక్కితే పాడైపోతాయని, రూ.కోటికి పైగా దేవస్థానానికి నష్టం వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో దేవస్థానం ఆధ్వర్యాన సేకరించి గోడౌన్‌లో వదిలేయడంతో అనేక చీరలు పాడైపోగా, వాటిని 2007లో కృష్ణానదిలో పడేయడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.