నగరంలో వీధి కుక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది. అరికట్టే వ్యవస్థ మాత్రం లేదు
కుక్కల స్వభావంలో వికృత మార్పు
చట్టం మారితే తప్ప అరికట్టలేమంటున్న అధికారులు
కరవరపెడుతున్న కుక్కల సంఖ్య
విశాఖపట్నం సిటీ : నగరంలో వీధి కుక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది. అరికట్టే వ్యవస్థ మాత్రం లేదు. కుక్కలను అంతమొందించేందుకు చట్టం ఒప్పుకోదు. ఫలితంగా ఏటా వీటి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ శాఖ గుర్తింపు పొందిన విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్‌అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్(వీఎస్‌పీసీఏ) అనే స్వచ్చంద సంస్థ మధురవాడ కేంద్రంగా చేసుకుని ఓజోన్‌వ్యాలీ వద్ద కుక్కలకు శస్త్రచికిత్సలను అందిస్తోంది.
ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 500 నుంచి రూ. 700 వరకూ జీవీఎంసీ ఖర్చు చేస్తోంది. అయినా వీటి సంఖ్య తగ్గడం లేదు. లక్ష మాత్రమే ఉన్నాయని జీవీఎంసీ అధికారులంటున్నా ఇంతకు రెండింతలకు పైగానే ఉండొచ్చనేది పశు వైద్యుల అంచనా. తాజాగా అనకాపల్లి, భీమిలి, పరిసర ప్రాంతాలన్నీ జీవీఎంసీలో కలిసి పోవడంతో కుక్కల రాకకు జీవీఎంసీలో రాచమార్గం ఏర్పడినట్టయ్యింది. కాగా కుక్కలలో క్రూర ప్రవర్తన నవంబర్ వరకూ ఉంటుందని వైద్య వర్గాలు అంటున్నాయి.
నగరానికి వలసబాట
పల్లెల్లో ఆహారం దొరక్కపోవడంతో కుక్కలు నగరానికి వలసబాట పడుతున్నాయి. ఇక్కడ మాంసాహారం లభిస్తుండడంతో ఇక్కడి నుంచి కదలడం లేదు. హార్బర్‌లో కావల్సినన్ని చేపలు లభ్యమవుతున్నాయి. వేలాది చికెన్, మటన్, ఫిష్ దుకాణాలతో పాటు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు వద్ద కుక్కలకు కావాల్సిన రకరకాల వంటలతో పుష్టిగా ఆహారం లభ్యమవుతోంది. దీంతో కుక్కలు పెరగడానికి నగరం వేదికైంది.
దూరంగా తరలిస్తే..
కుక్కలకు శస్త్రచికిత్సల తర్వాత వాటిని నగరానికి దూరంగా వదిలితే మంచిదని బాధితుల వాదన. కానీ తీసుకువెళ్లిన చోటే విడిచిపెట్టాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డు నిబంధనలు చెబుతున్నాయి. దీంతో జీవీఎంసీ అధికాారులు చేతులెత్తేస్తున్నారు. చట్టంలో మార్పు వస్తే తప్పా నగరం నుంచి తరమేయలేమంటున్నారు. కరిస్తే యాంటీ రేబిస్ వ్యాక్సీన్ ఇవ్వగలమని అంతకన్నా తామేమీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు.