పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన సత్యా విజన్ కేబుల్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి ఆందోళనకారులు దాడి చేశారు.
విజయనగరం: 'తెలంగాణ నోట్' సెగలు సీమాంధ్రలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. విజయనగరంలో జిల్లాలో ఉద్యమకారులు కదం తొక్కారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన సత్యా విజన్ కేబుల్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి ఆందోళనకారులు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. మంటలను అదుపు చేయడానికి వచ్చిన అగ్నిమాపక వాహనం అద్దాలు పగులగొట్టారు. పోలీసుల లాఠీచార్జి చేయడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు.
బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటిపై కూడా సమైక్యవాదుల దాడి చేశారు. ఆందోళనకారుల కళ్లలో చిన్న శ్రీను అనుచరులు కారం కొట్టారు.
పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీచార్జి చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదయం బొత్సకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు.