సీమాంధ్ర బీజేపీ నాయకులు విభజనను అడ్డుకునేందుకు అధిష్టానంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ప్రశ్నించారు.
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్:
సీమాంధ్ర బీజేపీ నాయకులు విభజనను అడ్డుకునేందుకు అధిష్టానంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ప్రశ్నించారు. గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహ ఏర్పాటుకు శనివారం స్థానిక శకుంతల కల్యాణమండపంలో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న జేఏసీ నాయకులు ముందుగా సి.క్యాంప్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. అనంతరం ర్యాలీగా కల్యాణమండపం చేరుకుని తాళాలు వేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకోగా.. తోసుకుంటూ లోనికి దూసుకెళ్లారు. సమావేశంలో నినాదాలు చేస్తుండగా బీజేపీ నాయకులు మండిపడ్డారు.
సమైక్యవాదులను బయటకు తోస్తూ దుర్భాషలాడటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలేశ్వరయ్య సమైక్యవాదులతో చర్చించారు. ఇది బీజేపీ సమావేశం కాదని సర్దిచెప్పబోగా.. వారు ఆగ్రహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి సమైక్యానికి కృషి చేస్తే.. బీజేపీ నాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పార్టీకి సమైక్య రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
రాయల తెలంగాణను కిషన్‌రెడ్డి వ్యతిరేకించి.. అదిష్టానంతో ఆ ప్రయత్నాన్ని ఉపసంహరింపజేశారని, అలాగే సీమాంధ్రలోని బీజేపీ నాయకులు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా అదిష్టానంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కపిలేశ్వరయ్యను సమైక్య నినాదం చేయాలని ఒత్తిడి చేశారు. తమ పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎంతకీ సమైక్యవాదులు దిగిరాకపోవడంతో పోలీసులు కపిలేశ్వరయ్యను అక్కడి నుంచి పంపించేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, జి.పుల్లయ్య, కె.చెన్నయ్య, పీబీవీ సుబ్బయ్య, జోజమ్మ, సోమశేఖర్, శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీధర్, ఇందిరాశాంతి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.