హిస్టరెక్టమీ అనంతరం యువతికి మూత్రం లీక్!
నెలలుగా శారీరక, మానసిక బాధలు
మూత్రాశయం-యోని మధ్య మూడు ఫిస్టులాలు
సంక్లిష్ట శస్త్రచికిత్సతో సమస్యను నయం చేసిన కర్నూలు కిమ్స్ వైద్యులు
కర్నూలు, సాక్షి: గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఏర్పడడంతో పాతికేళ్ల వయసులోనే బేతంచర్లకు చెందిన ఓ యువతికి హిస్టరెక్టమీ (గర్బాశయ తొలగింపు) శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఫైబ్రాయిడ్ కారణంగా ఆమెకు తరచు రక్తస్రావం అవుతుండటంతో ఆ శస్త్రచికిత్స తప్పలేదు. అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో దానికి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారు.
అయితే, హిస్టరెక్టమీ చేసిన తర్వాత ఆమెకు తరచు మూత్రం లీక్ అవ్వడం మొదలైంది. దీనివల్ల ఆమె ఎక్కడకూ బయటకు వెళ్లలేకపోవడం, తరచు దుర్వాసనతో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ వై.మనోజ్ కుమార్ ఆమెకు ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, పూర్తి ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు.
“నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన పాతికేళ్ల యువతికి తప్పనిసరి పరిస్థితిలో హిస్టరెక్టమీ చేయాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాతి నుంచి ఆమెకు మూత్రం లీక్ అవుతుండడంతో మా వద్దకు వచ్చారు. ఇక్కడ ఆమెకు సీటీ సిస్టోగ్రఫీ లాంటి కొన్ని పరీక్షలు చేస్తే.. ఆమెకు మూడు వెసికోవెజైనల్ ఫిస్టులాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఇవి మూత్రకోశానికి, యోనికి మధ్యన ఏర్పడతాయి. శస్త్రచికిత్స కారణంగా ఏర్పడిన ఈ ఫిస్టులాల వల్లే ఆమెకు మూత్రం లీక్ అయ్యే సమస్య తలెత్తింది. ఇలా జరగడం వల్ల రోగులు సమాజానికి, తమ కుటుంబసభ్యులకు కూడా దూరమై, క్రమంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. బయటకు రావడానికి ఇబ్బంది పడతారు.
ఈ కేసు సంక్లిష్టమైనది. ఎందుకంటే మూడింటిలో ఒక ఫిస్టులా మూత్రనాళానికి చాలా దగ్గరగా ఉంది. అందువల్ల దాని మరమ్మతును అత్యంత జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. దానికితోడు మొదటి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కణజాలాలు స్థిరపడేందుకు కనీసం మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది. వాళ్లు రెండు నెలల తర్వాత మా వద్దకు వచ్చారు. దాంతో మరో నెలరోజులు ఆగమని చెప్పి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేపట్టాం. ఈ శస్త్రచికిత్సలో మూత్రాశయాన్ని, యోనిని వేరు చేసి, దెబ్బతిన్న భాగాలను శుభ్రపరచి, కొత్త పొరలతో పునర్నిర్మాణం చేశాం. అత్యంత కచ్చితత్వం, జాగ్రత్తలతో మూడు ఫిస్టులాలనూ మూసేశాం. శస్త్రచికిత్స తర్వాత రోగి బాగా కోలుకున్నారు. మొత్తం క్యాథెటర్లు, ట్యూబులు కూడా తీసేసి ఆమెను డిశ్చార్జి చేశాం. ఇప్పుడు మూత్రం లీకేజి లేకపోవడంతో ఆమెకు పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంతకుముందు కంటే ఎంతో సంతోషంగా ఉన్నారు.
వెసికో వెజైనల్ ఫిస్టులా అనేది మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. ఇది కేవలం శారీరక సమస్య కాదు, సామాజిక అవరోధం కూడా. సమయానికి గుర్తించి సరైన చికిత్స చేస్తే పూర్తిగా నయం అవుతుంది. ఈ రోగి మళ్లీ సాధారణ జీవితానికి రావడం మా మొత్తం బృందానికి గొప్ప సంతృప్తినిచ్చింది” అని డాక్టర్ వై. మనోజ్ కుమార్ వివరించారు.


